ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి ఒక్కొక్కరు ఒక్కో రకం క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రపంచంలోనే అతి అరుదైన క్యాన్సర్ కూడా ఉంది. ఇది వస్తే శరీరంలోని ఎన్నో భాగాలను తొలగించాల్సి వస్తుంది. అలాంటి క్యాన్సర్ బారిన పడింది 39 ఏళ్ల రెబెక్కా.
రెబెక్కాది యూకేలోని కుండ్రియా. ఆమెకు 2018లో ఒక ఆఫీస్ పార్టీలో ఉండగా పొట్టలో ఏదో అసౌకర్యంగా అనిపించింది. మొదట అది ఆహారం పడక జరిగి ఉంటుందని అనుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కూడా కావొచ్చని సరిపెట్టుకుంది.
అరుదైన క్యాన్సర్ ఇది
కానీ దాని లక్షణాలు 8 వారాల కంటే ఎక్కువ కాలం ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు డాక్టర్ పొట్టలో అరుదైన క్యాన్సర్ వచ్చిందని అది పూర్తిగా ఇతర అవయవాలకు వ్యాపించిందని చెప్పారు. ఆ క్యాన్సర్ పేరు సూడోమైక్సోమా పెరిటోనీ. దీన్ని PMP అంటారు. 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే వ్యాధి ఇది.
ఇప్పుడు రెబెక్కా క్యాన్సర్ తో పోరాడుతున్న ఎంతోమందికి ఆశా కిరణం. ఆమెను చూసి ఇతర క్యాన్సర్ పేషెంట్లు కూడా తమకు వచ్చింది చిన్న సమస్యేనని ధైర్యంగా బతుకుతున్నారు. ఎందుకంటే ఈమె శరీరంలో మనిషి పుట్టినప్పుడు ఉన్న అవయవాల్లో ఎన్నో అవయవాలను వైద్యులు తొలగించారు. కొన్నింటిని సగానికి పైగా తీశారు. తనలాగా ఈ అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం రెబెక్కా ‘గో ఫండ్ మీ’ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు సైకిల్ రేసులో కూడా పాల్గొనబోతోంది.
సూడోమైక్సోమా పెరిటోనీ అనే క్యాన్సర్ ఉదర కుహరంలో వచ్చే ఒక అరుదైన క్యాన్సర్. ఉదర కుహరంలో శ్లేష్మం పేరుకుపోయి అక్కడ కణితిలాగా ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి నెమ్మదిగా పెరుగుతుంది. పొట్టనొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలు రావడం, బరువు తగ్గిపోవడం, పిల్లలు పుట్టకపోవడం వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. శస్త్ర చికిత్స చేసి ఈ కణితిని తొలగిస్తారు. కానీ దీన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ఇతర అవయవాలు కూడా ఇది చాలా వేగంగా సోకుతుంది.
ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు పొట్టలో ఉన్న అపెండిక్స్ అనే భాగం పగిలిపోవడం వల్ల వస్తుంది. లేదా మీ ఊకినస్ సిస్టిక్ ట్యూమర్ అనేది కణితిలాగా పెరిగిపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఈ అవయవాలు తీసేశారు
దీంతో రెబెక్కా ఏప్రిల్ 2019లో మొదటిసారి శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ శస్త్ర చికిత్సలో కొన్ని అంతర్గత అవయవాలను తొలగించారు. అలాగే శేష్మాన్ని కూడా తొలగించారు. ఎనిమిది రౌండ్లు కీమోథెరపీ కూడా ఇచ్చారు. అయినా పరిస్థితి భాగోలేదు. దాంతో నవంబర్ 2019లో మరొకసారి శస్త్ర చికిత్స చేసారు. ఆ సమయంలో పిత్తాశయం, ప్లీహం, పెద్ద పేగులోని కొంత భాగం, గర్భాశయము, కడుపులోని లైనింగ్, పురీష నాళం, పేగులోని కొంత భాగము కాలేయ లైనింగ్, డయాఫ్రగమ్ వంటివన్నీ కొంతమేరకు తొలగించారు. దీంతో ఆమె శరీరంలోని అవయవాలు చాలావరకు లేవు. అయినా సరే ఆమె అతికష్టమ్మీద జీవితం కొనసాగిస్తుంది.
రోజుకు 50 మాత్రలు
ఆమె ప్రస్తుతం బతకాలంటే రోజుకి 50 నుండి 60 మాత్రలు వేసుకోవాల్సిందే. దీనిలో హార్మోన్ల చికిత్సకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి అనారోగ్యంలో కూడా జీవించే అవకాశాన్ని ఆమె వదులుకోలేదు.
ఇప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా మాట్లాడుతోంది. ‘నేను ఇప్పటికీ జీవించాలని కోరుకుంటున్నాను. సర్ఫింగ్ చేస్తాను.. హాట్ ఎయిర్ బెలూన్ కి వెళ్తాను. నయం చేయలేని వ్యాధి ఉన్నప్పుడు ఎంతోమంది డిప్రెషన్ వెళ్ళిపోతారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి సరైన మనస్తత్వంతో ముందుకు వెళితే కొన్ని రోజులైనా సంతోషంగా జీవించగలం’ అని చెబుతోంది.