Indian Railways: భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉన్న ఈ- ప్యాంట్రీ సేవను ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ ఈ సేవను పరిచయం చేస్తోంది. రీసెంట్ గా వివేక్ ఎక్స్ ప్రెస్ లో ఈ- ప్యాంట్రీ సేవను ప్రారంభించింది. కొద్ది రోజుల పాటు టెస్ట్ చేసింది. ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని రైళ్లకు విస్తరించబోతోంది.
పైలెట్ ప్రాజెక్టు విజయవంతం
ఈ సర్వీసు ద్వారా ప్రయాణీకులు వారి ప్రయాణ సమయంలో పరిశుభ్రమైన భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధిక ఛార్జీలు, ఆహార నాణ్యత లాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉండదు. ప్రస్తుతం వివేక్ ఎక్స్ ప్రెస్ లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ-ప్యాంట్రీ సేవ ద్వారా ప్రయాణీకులు తమ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో భోజనాన్ని ఎంచుకుని అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సేవ విజయవంతం కావడంతో, రాబోయే నెలల్లో సుమారు 20 నుండి 25 రైళ్లకు విస్తరించనుంది. ఈ-ప్యాంట్రీ సేవను ఉపయోగించుకోవడానికి, ప్రయాణీకులు IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. నిర్ధారణ తర్వాత, SMS లేదంటే ఇమెయిల్ ద్వారా ఫుడ్ కన్ఫర్మేషన్ కోడ్ అందుకుంటారు. ప్రయాణ రోజున, ప్రయాణీకులు ఈ కోడ్ ను పాంట్రీ కార్ సిబ్బందికి అందజేస్తారు. వారు ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని నేరుగా వారి సీటు దగ్గరికే తీసుకొచ్చి అందిస్తారు.
అధిక ధరల ఇబ్బంది ఉండదు!
ఈ-ప్యాంట్రీ సర్వీసు ప్రధాన లక్ష్యం నగదు లావాదేవీలను తగ్గించడం. బుకింగ్ ప్రక్రియలో చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఇలా చేయడం వల్ల అధిక ఛార్జీల ఇబ్బంది ఉండదు. భోజన ధరలు స్థిరంగా, పారదర్శకంగా ఉంటాయి. IRCTC-అధికారిక విక్రేతలు మాత్రమే ముందుగా బుక్ చేసుకున్న భోజనాన్ని డెలివరీ చేస్తారు. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా భోజనం ఉంటుంది. ఈ సేవ కారణంగా రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ-ప్యాంట్రీ సేవ రైల్వే నెట్ వర్క్ అంతటా విస్తరిస్తున్నందున, ప్రయాణీకుల సేవలకు మెరుగైన భోజనం అందేలా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్ ఉండేలా ఆయా కాంట్రాక్టు సంస్థలకు రైల్వే ఆదేశాలు జారీ చేసింది.
Read Also: కాశ్మీర్ వందేభారత్ కు ముహూర్తం ఫిక్స్, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ఎప్పుడంటే?
ఈ ప్యాంట్రీ సేవలు రైల్వే ప్రయాణంలో కీలక మార్పుకు కారణం కాబోతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు. ఇకపై సామాన్యులు కూడా రైల్వే ప్రయాణ సమయంలో నచ్చిన ఆహారాన్ని పొందే అవకాశం ఉంటుంది. అధిక ఖర్చులను నివారించడంతో పాటు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని ఐఆర్సీటీసీ ప్రకటించింది.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!