అప్పుడే పుట్టిన శిశువులకు నుంచి ఏడాది వయసు శిశువుల వరకు ప్రతిరోజు బాడీ మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మసాజ్ కు వారి సున్నితమైన చర్మం ఎంతో అద్భుతంగా స్పందిస్తుంది. వారి చిన్ని శరీరాలు ఈ మసాజ్ కు అలవాటు పడటానికి కష్టపడతాయి. మసాజ్ వారికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు ఎక్కువ మద్దతుని ఇస్తుంది. అలాగే మసాజ్ చేయడానికి మీరు వాడే నూనెలు కూడా వారిపై ఎంతో ప్రభావాన్ని ఇస్తాయి. మసాజ్ చేయడం వల్ల వారికి సహజ రక్షణ లభిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వారి చర్మానికి పోషణ లభిస్తుంది. చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
మసాజ్ ఎందుకు?
శిశువులకు మసాజ్ చేయడం ఎంతో ముఖ్యం. ఉష్ణోగ్రతలు తగ్గిన పెరిగినా కూడా శిశువు చర్మం తేమను వేగంగా కోల్పోతుంది. చల్లని పొడి గాలి వల్ల వారి చర్మం మచ్చలకి గురవుతుంది. మసాజ్ చేయడం వల్ల ఒక రక్షిత పొర వారిపై ఏర్పడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మంచి మసాజ్ ఆయిల్ ను ఎంచుకుంటే వారిలో రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. వారి ఎదుగుదల బాగుంటుంది. ప్రశాంతంగా నిద్రపోతారు.
ఈ నూనెలు మంచిది
శిశువులకు మసాజ్ చేసేందుకు ఉత్తమమైన నూనెలను ఎంచుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఈ తో సమృద్ధిగా ఉన్న నూనె ఎంచుకుంటే మంచిది. బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎక్కువ పోషణ లభిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ కూడా ఎంతో మంచిది. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. దీనిలో ఒమేగా త్రీ, ఒమేగా సిక్,స్ ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. సహజ తేమను కోల్పోకుండా కాపాడతాయి.
యూకలిప్టస్ ఆయిల్
యూకలిప్టస్ ఆయిల్ ను చాతీ, వీపుపై రాసి మర్దన చేస్తే వారికి జలుబు వంటివి తగ్గుతాయి. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వేసవిలో కొబ్బరి నూనె, శీతాకాలంలో ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా వారికి కావలసిన నూనెను ఎంపిక చేసుకోవాలి. ఇది సీజనల్ వ్యాధులను అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఎముకలు బలంగా మారుతాయి. పిల్లలు పెరిగే కొద్దీ మరింత చురుగ్గా ఉంటారు. నువ్వుల నూనె వంటివి వాటితో మసాజ్ చేస్తే కాల్షియం శోషణ పెరుగుతుంది.
రసాయనాలు లేని నూనెలే వాడాలి
శిశువుకు వాడే నూనె రసాయనాలు కలపనిదై ఉండాలి. కాబట్టి సేంద్రీయ పద్ధతిలో తయారైన నూనె మాత్రమే ఎంచుకోవాలి. వాటిలో పారాబెన్లు, ఆల్కహాల్, ఫినాక్సిథెనాల్ వంటివి ఉండకూడదు. శిశువు చర్మం పెద్దవారి చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం అసౌకర్యానికి గురైనా దద్దుర్లు వంటివి వస్తాయి. దురద కూడా పెరిగిపోతుంది.
ఆరోగ్యంగా.. ఆనందంగా ఎదిగేందుకు..
పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదిగేలా చేయడానికి మసాజ్ అనేది ఒక అందమైన మార్గం. అలాగే తల్లీ బిడ్డలకు మధ్య మసాజ్ ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. తల్లి సున్నితమైన చేతుల నుంచి వచ్చే వెచ్చదనం, స్పర్శ పిల్లలకు ఓదార్పునిస్తుంది. వారికి భద్రతా భావాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లే నేరుగా బిడ్డకు మసాజ్ చేయడం అనేది మంచి పద్ధతి.
పరిశుభ్రంగా.. వెచ్చగా ఉండాలి
మీరు మసాజ్ చేసే చోటు చాలా పరిశుభ్రంగా వెచ్చగా ఉండేలా చూసుకోండి. మీ అరచేతిలో కొన్ని చుక్కల నూనె పోసుకొని… ముందుగా మీ రెండు చేతులకు రుద్ది వేడి చేయండి. ఆ తర్వాత శిశువుకు సున్నితంగా రాస్తూ వృత్తాకారంగా మసాజ్ చేయండి. చేతులు, కాళ్లు, వీపుపై అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.