జీవితంలో విజయం సాధించాలన్నా, ఆనందంగా జీవించాలన్నా మంచి జీవిత భాగస్వామి తోడు కావాలి. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అంత సులభం కాదు. కొందరు తొందరపడి పెళ్లిళ్లు చేసుకుంటారు. అవి ఎక్కువ కాలం నిలవక విడాకులు తీసుకుంటారు. భావోద్వేగంతో వెంటనే తప్పుడు నిర్ణయాలు తీసుకునే బదులు ఆచితూచి అడుగువేస్తే మంచిది. సరైన జీవిత భాగస్వామి ఎంచుకోవాలి. అంటే వారితో మీరు కొంత కాలం ప్రయాణం చేయాలి. వారిలో కొన్ని లక్షణాలు మీకు కనిపిస్తే అతను మంచి లైఫ్ పార్టనర్ కాగలరని అర్థం చేసుకోవాలి.
అందం కాదు మనసును చూడండి
ముందుగా కొంతమంది అందాన్నే చూస్తారు. అందం ఎక్కువ కాలం నిలవదు. కానీ మంచి మనసు జీవితాంతం వెంటే ఉంటుంది. శారీరక ఆకర్షణ ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోకండి. శారీరక సౌందర్యం కొన్నేళ్లకే మసకబారిపోతుంది. జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండాలంటే అతనికి మంచి వ్యక్తిత్వం, విలువలు, ఆలోచనలు ఉండాలి అవి ఉన్నాయో లేవో చూసుకోండి.
గౌరవించే వ్యక్తిని
ఏ అనుబంధం లోనైనా ఎంతోకొంత రాజీపడడం అవసరం. కానీ మీ ఆనందాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. జీవితాంతం ఒక వ్యక్తితో కలిసి ఉండాలంటే జీవితాంతం రాజీ పడేలా ఎంపిక చేసుకోకూడదు. మీ అవసరాలన్నింటినీ త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ అవసరాలను అర్థం చేసుకొని మిమ్మల్ని గౌరవించే వ్యక్తిని ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఒక వ్యక్తితో ప్రయాణం చేస్తున్నప్పుడు అతడు మిమ్మల్ని ఎంతగా గౌరవిస్తున్నాడో, మీ అవసరాలను ఎంతగా అర్థం చేసుకుంటున్నాడో మీరు గ్రహించాలి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి
మీ జీవిత భాగస్వామి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తప్పవు. అతనితో పాటు కలిసి నడిచే మీరు కూడా వాటిని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వారితో కొన్నాళ్లపాటు ప్రయాణం చేయండి. ఆ ప్రయాణంలో వారు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి. ఆచితూచి అడుగులు వేసే వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తాడు. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని వెంట వెంటనే అమలు చేయడం చేసేవారు ఎప్పటికైనా పశ్చాత్తాపపడతారు. అలాంటి వారితో కలిసి ఉంటే మీరు కూడా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఎవరైతే నిర్ణయాలు త్వరగా తీసుకోకుండా కాస్త సమయం తీసుకుని ఆలోచిస్తారో వారు మంచి జీవిత భాగస్వామి కాగలరు.
పెళ్లి అనేది కేవలం కుటుంబ ఆనందం కోసమే కాదు, మీ ఆనందం కోసం కూడా. కాబట్టి కుటుంబం కోసం స్నేహితుల కోసం మీరు పెళ్లి చేసుకోకండి. మీ హృదయానికి నచ్చే వ్యక్తినే పెళ్లి చేసుకోండి. మీ కుటుంబం లేదా స్నేహితులు కొంత వరకే జీవితంలో మీకు తోడుంటారు.కానీ మీ జీవిత భాగస్వామి మీకు జీవితాంతం మీ వెంటే ఉండాలి. అలా ఉండాలంటే అతడు కచ్చితంగా మంచి వ్యక్తి ఉండాలి. కాబట్టి మీ మనసు చెప్పినదే వినండి. మీకు ఎదుటి వ్యక్తి అంత మంచిగా అనిపించకపోయినా, అతడినిలోని లక్షణాలు నచ్చకపోయినా… వెంటనే మీరు నో చెప్పండి.
Also Read: షుగర్ పేషెంట్లకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువట, ఎందుకంటే ?
కుటుంబం తెచ్చిన ఒత్తిడికి లోనైపోతే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెళ్లయ్యాక మీరు ఇబ్బంది పడడం చూసి మీ కుటుంబం కూడా ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి ఆచి తూచి పెళ్లి విషయంలో అడుగేయండి. ఎవరైతే ఓపికగా ఉంటారో, ఇతరులపై పరుషంగా మాట్లాడరో, ఆచితూచి అడుగులు వేస్తారో, ఎదుటి వ్యక్తులకి కూడా గౌరవం ఇస్తారో… అలాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కేవలం తమ అవసరాలు మాత్రమే చూసుకునే వ్యక్తి స్వార్థపరుడితో సమానం. అతనితో జీవితం కూడా చాలా కష్టంగా ఉంటుంది.