Summer Diet: వేసవి కాలం వచ్చిందంటే ఎండలు మండిపోతాయి. వాతావరణం విపరీతంగా వేడెక్కిపోతుంది. వేసవి తాపానికి తగ్గట్టుగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోకుంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది. అందుకే తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇక సమ్మర్‌లో ఏరకమైన ఆహారం తీసుకోవాలనే దానిపై న్యూట్రీషనిస్ట్‌లు పలు సూచనలు చేస్తున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మానేసి, మరికొన్నింటిని ప్రతి రోజూ తీసుకునే డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభం అవుతుందని అంటున్నారు.
ఏం తినకూడదు..?
వేసవిలో ఎండలు మండిపోతున్న తరుణంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలని న్యూట్రీషనిస్ట్‌లు చెబుతున్నారు. ఎక్కువ ఉప్పు ఉండే ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదని అంటున్నారు.
అలాగే హెవీ ఫుడ్, జిడ్డు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ ఫుడ్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందట. వేయించిన పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ వంటివి జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందట. అంతేకాకుండా వీటిని ఎక్కువగా తీసుకుంటే వేడి వాతావరణంలో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: ఎనీమియా ఎందుకు వస్తుంది..?
షుగర్ అధికంగా ఉండే డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా వేసవిలో అసౌకర్యం కలిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే వీటిని తీసుకోవడం తగ్గిస్తే మంచిదని అంటున్నారు.
ఏం తినాలి..?
కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేస్తే, మరికొన్ని ఫుడ్స్‌ని మాత్రం తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రీషనిస్ట్‌లు సూచిస్తున్నారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహాయపడే పండ్లు కూరగాయలను తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. పుచ్చకాయ, కీర దోసకాయ, ఆకు కూరలు, సిట్రస్ పండ్లను ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని కోసం నీళ్లు, మజ్జిగ, పెరుగు, ఫ్రూట్ స్మూతీలనే డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రీషనిస్ట్‌లు కూడా చెబుతున్నారు.
మాంసానికి బదులుగా గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్ వంటి తేలికైన ప్రోటీన్ ఉండే ఆహారాన్ని సమ్మర్ డైట్‌లో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు బార్లీ, క్వినోవా, ఓట్స్, పాలిష్ చేయని బియ్యం, మిల్లెట్స్ వంటి తృణధాన్యాలను ప్రతి రోజూ తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయట. అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా చేయడంలో హెల్ప్ చేస్తాయి.