Indian Railway: రవాణ రంగంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజుకు అప్ డేట్ అవుతోంది. అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీలో సరికొత్త రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. మూడు కోచ్ రైళ్లతో కూడిని మెట్రో కారిడార్ ను నిర్మించబోతోంది. లజ్ పత్ నగర్ నుంచి సాకేత్ జి బ్లాక్ వరకు విస్తరించి ఉన్న ఎనిమిది కిలో మీటర్ల పరిధిలోని ఈ కారిడార్ లో స్వల్ప దూర ప్రయాణానికి అనుగుణంగా రూపొందించిన రైళ్లు నడుస్తాయి. ఇందులో మొత్తం 8 స్టేషన్లు ఉంటాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది.
దేశంలో తొలిసారి 3-కోచ్ రైల్వే కారిడార్
మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-IVలో భాగమైన లజ్ పత్ నగర్ నుంచి సాకేత్ జి బ్లాక్ మెట్రో కారిడార్‌లో ఈ రైళ్లు నడుస్తాయి. చివరి మైలు కనెక్టివిటీని పెంచడం, ఇప్పటికే ఉన్న మెట్రో కారిడార్లతో సజావుగా ఇంటర్ ఛేంజ్ లను సులభతరం చేయడంలో భాగంగా ఈ కారిడార్ ను నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. “దేశంలో ఇప్పటికే నాలుగు, ఆరు, ఎనిమిది కోచ్ రైళ్లను ఉపయోగించే చాలా మెట్రో లైన్లు అందుబాటులో ఉన్నాయి. వినూత్నమైన మూడు కోచ్ వ్యవస్థను ప్రత్యేకంగా స్వల్ప దూర పట్టణ ప్రయాణానికి అనుగుణంగా అభివృద్ధి చేశారు. చిన్న రైలు కాన్ఫిగరేషన్ ఖర్చుతో కూడుకున్న, మెరుగైన పరిష్కారాన్ని అందిస్తుంది. మెరుగైన ఫ్రీక్వెన్సీ, కార్యాచరణ సామర్థ్యం, పెద్ద సంఖ్యలో రోజువారీ ప్రయాణీకులకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది” అని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణీకుల రద్దీ, వాస్తవిక అంచనా ఆధారంగా, తక్కువ దూరాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించే మెట్రో సేవలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు DMRC తెలిపింది.
Read Also: వేసవిలోనూ మంచు కురిసే ప్రాంతం.. రోహ్ తంగ్ పాస్ కు వెళ్లడానికి బెస్ట్ టైం ఇదే!
కీలక ప్రాంతాలకు యాక్సెస్
కొత్త కారిడార్ లో ఎనిమిది స్టేషన్లు ఉంటాయి. లజ్‌పత్ నగర్ (పిం, వైలెట్ లైన్‌లతో ఇంటర్‌చేంజ్), ఆండ్రూస్ గంజ్, GK-1, చిరాగ్ ఢిల్లీ, పుష్ప భవన్, సాకేత్ కోర్ట్, పుష్ప విహార్, సాకేత్ G బ్లాక్ (గోల్డెన్ లైన్‌తో ఇంటర్‌చేంజ్) ఉంటుంది. ఢిల్లీలోని కీలకమైన నివాస, వాణిజ్య కేంద్రాలకు యాక్సెస్ పెరగనుంది. ఈ ఈ కారిడార్ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. మొత్తం మెట్రో నెట్ వర్క్ లో రెండవ అతి చిన్నదిగా ఉంటుందని DMRC తెలిపింది. “మార్చి 2024లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3-కోచ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టుకు పునాది వేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2028 నాటికి కారిడార్ పూర్తవుతుందని భావిస్తున్నాం” అని DMRC అధికారులు తెలిపారు. ఈ రవాణా వ్యవస్థ తక్కువ ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఇకపై దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ తరహా కారిడార్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Read Also: IRCTC నార్త్ ఈస్ట్ స్పెషల్ టూర్.. 33 శాతం డిస్కౌంట్ తో 5 రాష్ట్రాలు కవర్!