చలికాలం వచ్చిందంటే చాలా మంది వేడి చేసే ఆహారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ కాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, శక్తినిచ్చే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో మొక్కజొన్న రొట్టె ఒకటి. గ్రామాల్లో అయితే చలికాలం వస్తే మొక్కజొన్న రొట్టెలు తప్పనిసరిగానే తింటారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ఎందుకంటే మొక్కజొన్న రొట్టెలు రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ఇవి ఎందుకు మంచివో తెలుసుకోండి.
జొన్నరొట్టెలతో ఆరోగ్యం
చలికాలంలో శరీర ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో శరీరానికి వేడి అందించే ఆహారం అవసరం. మొక్కజొన్న రొట్టెల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తాయి. ఇవి తిన్న తర్వాత వెంటనే ఆకలి వేయదు. శరీరం వేడిగా, శక్తివంతంగా ఉంటుంది. చలికాలంలో మనం అలసట, బలహీనతను ఎక్కువగా అనుభవిస్తాం. మొక్కజొన్న రొట్టెలు అలాంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు, వీటిలో ఉన్న సహజ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్య రావడం సాధారణమే. మొక్కజొన్న రొట్టె తినడం వల్ల ఆ సమస్య కూడా తగ్గుతుంది.
ఎన్నో పోషకాలు
మొక్కజొన్న రొట్టెల్లో విటమిన్ B తగినంతగా ఉంటుంది. ఇవి శరీరంలో మెటాబాలిజాన్ని సరిగ్గా పనిచేసేలా సహాయపడతాయి. దీనివల్ల శరీరంలో చలి ప్రభావం తగ్గి, వేడి నిల్వ ఉంటుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రంలో ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలో, ఏమి తినకూడదో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారి కోసం మొక్కజొన్న రొట్టె మంచి ఎంపిక. ఇది రక్త చక్కెరను ఒక్కసారిగా పెంచదు. అలాగే, మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువైతే ఈ సమస్యలు తగ్గుతాయి.
మొక్కజొన్న రొట్టెలు చలికాలంలో గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. చలి ఎక్కువైతే రక్తనాళాలు కుచించుకుపోతాయి. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న రొట్టెల్లో ఉన్న పోషకాలు రక్తనాళాలను రిలాక్స్ చేసి గుండెకు ఒత్తిడి రాకుండా కాపాడతాయి. పైగా ఇవి గ్లూటెన్ లేని ఆహారం కావడం వల్ల గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి కూడా ఇవి సురక్షితం. చలికాలంలో జీర్ణవ్యవస్థ కొంచెం మందగిస్తుంది. కానీ మొక్కజొన్న రొట్టెలు తేలికగానే జీర్ణమవుతాయి. కాబట్టి పెద్దవాళ్లు, పిల్లలు ఎవరికైనా ఇవి సులువుగా అరిగిపోతాయి.
చలికాలంలో శరీరానికి మంచి ఫ్యాట్ కూడా అవసరం. మొక్కజొన్న రొట్టెలను సాధారణంగా నెయ్యి లేదా వెన్నతో తింటారు. దీని వల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. ఈ కొవ్వు శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రామాల్లో శీతాకాలపు ఉదయాలు మొక్కజొన్న రొట్టె, సగ్గుబియ్యం జావ, శెనగపప్పుతో చేసిన కూరలతో ప్రారంభం కావడం కూడా అందుకే. పైగా మొక్కజొన్న పూర్తిగా సహజమైనది. ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. అందువల్ల చలికాలంలో దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.