Sleeping Needs: రోజూ మన శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే అవసరమైంది నిద్ర కూడా. కానీ ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్‌లో సరిపడా నిద్రకు మనం దూరమవుతున్నాము. గంటల తరబడి మొబైల్‌లో గడపడం, రాత్రి షిఫ్టులు, పని ఒత్తిడి, టెన్షన్లు ఇవన్నీ కలిసి నిద్రపోయే సమయం దెబ్బతీస్తున్నాయి.
నిద్ర తక్కువగా పడటం వల్ల మొదట్లో శరీరానికి అలసట మాత్రమే అనిపించినా క్రమంగా అది మన మెదడుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి మీద ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. మీరు తరచూ ఏదో ఒక విషయం మరిచిపోవడం మొదలు పెట్టారా? పుస్తకం చదివితే గుర్తు పెట్టుకోలేక పోతున్నారా? ఏదో పని చేయాలని అనుకుని మధ్యలో మరచిపోతున్నారా? అలా అయితే కారణం సరైన నిద్ర లేకపోవమే దీనికి కారణం కావచ్చు.
మన మెదడు రోజంతా ఎన్నో సమాచారాలను సేకరిస్తుంది. కానీ వాటిని సరిగ్గా నిల్వ చేసేది, గుర్తు పెట్టుకునేలా మార్చేది రాత్రిపూట నిద్రలోనే. నిద్రపోయే సమయంలోనే మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం పనిచేసి, రోజు మొత్తం నేర్చుకున్న విషయాలను సుదీర్ఘ జ్ఞాపకంగా మార్చుతుంది. మీకు నిద్ర లేకపోతే మెదడు కొత్తగా నేర్చుకున్న విషయాలను గుర్తు పెట్టుకునే ప్రక్రియ సరిగా కొనసాగదు. దాంతో చిన్న చిన్న విషయాల్నే గుర్తు పెట్టుకోలేని పిస్థితి వస్తుంది.
Also Read: Scorpion Bite: తేలు కుట్టిన చోట వెంటనే ఇలా చేయండి.. లేదంటే?
అంతే కాదు మెదడుకు సరిగా నిద్ర లేకపోవడంతో కణాలు విశ్రాంతి పొందవు. దీంతో గుర్తు పెట్టుకోవడం కష్టమవడం మొదలవుతుంది. క్రమంగా వాటి మధ్య అందుకునే సమాచారం తగ్గిపోతుంది. ఫలితంగా దృష్టి కేంద్రీకరణ తగ్గిపోతుంది. చదువుతున్న విద్యార్థులు, పనిచేసే ఉద్యోగులు ఎవరికైనా సరిపడ నిద్ర లేకపోతే వారి పనితీరు రాను రాను పడిపోతూ వస్తుంది. కానీ దానిని మనం గుర్తించలేము.
సరైన నిద్ర లేకపోతే, మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి ఎక్కువ అవడం వల్ల మనసు ఎప్పుడూ ఆందోళనలో ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కొత్త విషయాలను నేర్చుకోవడమూ, గుర్తు పెట్టుకోవడమూ కష్టమవుతుంది. అంటే, సరైన నిద్ర లేకపోవడం వల్ల మీరు వర్క్ విషయంలో ఉత్సాహంగా లేకపోవడమే కాకుండా, నేర్చుకున్న విషయాలు గుర్తు పెట్టుకోవడంలోనూ వెనక బడుతారు.
నిద్ర తగ్గడం వల్ల పెద్దగా మార్పులు కనిపించకపోయినా రాను రాను అది పెద్ద సమస్యగా మారుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆలోచనా శక్తి మందగించడం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం రావడం మొదలైనవి నిద్రలేమి సంకేతాలు. దీర్ఘకాలంలో అయితే అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధిత వ్యాధులకు కూడా ఇది కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా పడుకోవాలి. నిద్ర సమయాన్ని వదిలేయడం అంటే మన మెదడు ఆరోగ్యాన్నే త్యాగం చేసినట్టే. మీరు ఎక్కువగా చదవాలనుకుంటే, జ్ఞాపకశక్తి బలంగా ఉండాలంటే, పుస్తకం ముందుకి కాదు, ముందు మంచం మీదకే వెళ్లాలి. ఎందుకంటే మంచి నిద్రే మంచి జ్ఞాపకశక్తికి మూలం. అందువల్ల ఇకనుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో సరిగ్గా నిద్రపోవడం అలవాటు చేసుకోండి.