Tirumala Ugra Srinivasa: శ్రీవారి నామస్మరణతో మనసు పులకిస్తుంది. గోవిందా.. గోవిందా అన్న ఒక్క మాటలోనే భక్తి పరవశిస్తుంది. ఆ తిరుమల స్వామివారి సన్నిధిలో ఒక్కసారి నిలబడితే.. ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది.. అలాంటి తిరుమలలో.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే ఓ దివ్యరూపం ఉంది.. ఆ రూపమే.. ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఏడాది మొత్తం ఆలయంలోనే కొలువై ఉండే ఈ స్వామివారు.. కైశిక ద్వాదశి రోజున మాత్రమే ఆలయం బయటకి వస్తారు. శ్రీదేవి.. భూదేవి సమేతంగా.. తెల్లవారుజామున.. బంగారు తిరుచ్చిపై.. నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యోదయానికి ముందే జరిగిన ఈ దివ్య ఊరేగింపు.. తిరుమలలో అత్యంత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. రోజూ గోవిందా.. గోవిందా.. అంటూ స్వామిని తలచే భక్తులకు.. ఏడాదికి ఒక్కసారి కనిపించే ఈ దర్శనం.. నిజంగా ఓ అపూర్వమైన భాగ్యం.
కైశిక ద్వాదశి కథలో ప్రధాన పాత్ర..
కైశిక ద్వాదశి అంటే కేవలం ఓ పండుగ కాదు.. భక్తి ఎంత గొప్పదో చెప్పే ఓ పురాణ గాథ. ఆ కథలో ప్రధాన పాత్ర.. నంపాడువాన్. శ్రీమహావిష్ణువుకు పరమ భక్తుడైన నంపాడువాన్.. కైశిక రాగంలో స్వామిని కీర్తిస్తూ ఆరాధించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఓ రోజు.. తనను బ్రహ్మరాక్షసుడు అడ్డగించి ఆహారంగా కోరాడు. అయితే స్వామిని కీర్తించి వస్తానని నంపాడువాన్ మాట ఇచ్చాడు. స్వామి సేవ పూర్తయ్యాక.. తన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉన్నా.. ఇచ్చిన మాట కోసం తిరిగి బ్రహ్మరాక్షసుడి దగ్గరకు వెళ్లాడు. అతడి భక్తికి.. సత్యనిష్ఠకు మెచ్చిన భగవంతుడు.. బ్రహ్మరాక్షసుడికి శాపవిమోచనం కలిగించి.. నంపాడువాన్‌కు మోక్షాన్ని ప్రసాదించినట్లు పురాణ కథనం.
భక్తులు అత్యంత పవిత్రంగా దీనిని భావిస్తారు..
అందుకే.. కైశిక ద్వాదశి అంటే భక్తి మాత్రమే కాదు.. మాటకు కట్టుబడిన భక్తుడి సత్యనిష్ఠకు ప్రతీక. శ్రీ చక్రతీర్థ ముక్కోటి కూడా ఇదే రోజు. శేషాచల పర్వతాల్లో ఉన్న పవిత్ర తీర్థాల్లో చక్రతీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కొండల మధ్య.. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ పుణ్య తీర్థం వద్ద.. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ కొలువైన శ్రీ నరసింహస్వామి, ఆంజనేయస్వామికి కూడా విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయి. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ తీర్థాన్ని.. భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఓం నమో వేంకటేశాయ..!
Also Read: తమిళనాడు టు ఏపీ.. డేటా లీక్ కలకలం! 15 మంది ఎగ్జిట్ వెనుక అసలు కథేంటి?