మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కొంత మందిని బొంద తీసి పూడ్చి పెడితే, మరికొంత మందిని దహనం చేస్తారు. ఆ బూడిదను తీసుకెళ్లి నదీ జలాల్లో కలుపుతారు. అయితే, మనిషి చనిపోయిన తర్వాత కూడా బతకవచ్చంటున్నారు పరిశోధకులు. మనిషిలా కాకుండా చెట్టులా మారి నలుగురికి ఉపయోగపడవచ్చు అంటున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మనిషి చనిపోయిన తర్వాత సంప్రదాయ పద్దతుల ద్వారా మనిషిని సమాధి చేయకుండా, మీ శరీరం లేదంటే బూడిదను చెట్టు పెరిగేలా ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఆర్గానిక్ బరియల్ పాడ్ లను ఉపయోగిస్తున్నారు. పర్యావరణ అనుకూలమైన ఈ పద్దతి ద్వారా మనిషి చనిపోయిన తర్వాత కూడా చెట్టులా బతికే అవకాశం ఉందన్నారు. ఈ బయోడిగ్రేడబుల్ పాడ్ లు ప్రకృతిలో కలిసిపోతాయి. మానవ అవశేషాలను చెట్టుకు పోషణగా అందిస్తాయి.
బరియల్ పాడ్స్ అనేవి నేలలో విచ్ఛిన్నమయ్యే సహజ పదార్థాలతో తయారు అయిన ప్రత్యేక క్యాప్సూల్. మనిషి చనిపోయిన తర్వాత వారి బూడిదను, కొన్ని సందర్భాల్లో వారి శరీరాన్ని పాడ్ లోపల ఉంచుతారు. ఆ పాడ్ మీద ఒక విత్తనం, లేదంటే చిన్న మొక్కను నాటుతారు. నేలలో పాతిపెట్టిన బరియల్ పాడ్ నెమ్మదిగా కుళ్లిపోతుంది. ఆ పాడ్ లోని బూడిత లేదంటే శరీరం కూడా నేలలో కలిసి చెట్టు పెరగడానికి సహాయపడే పోషకాలను విడుదల చేస్తాయి. కాలక్రమేణా, చెట్టు సజీవ స్మారక చిహ్నంగా మారుతుంది. కొత్త రూపంలో జీవితం కొనసాగిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం, చాలా బరియల్ పాడ్‌లలో దహనం చేసిన బూడిదను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే పూర్తి శరీరాన్ని ఉంచే పాడ్ లు ఇప్పటి వరకు తయారు చేయలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కాప్సులా ముండి, బెటర్ ప్లేస్ ఫారెస్ట్స్ లాంటి కంపెనీలు మొత్తం శరీరాలను ఉంచే బరియల్ పాడ్స్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. పర్యావరణానికి సహాయం చేస్తూనే చనిపోయినవారిని గౌరవించడానికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నాయి.
⦿ పాడ్‌ను రెడీ చేయాలి: మనిషిని దహనం చేసిన తర్వాత మిగిలిన బూడిద లేందంటే మృతదేహబయోడిగ్రేడబుల్ పాడ్ లో ఉంచుతారు. ఈ పాడ్ ను మొక్కజొన్న పిండి, వెదురు పిండి లేదంటే ఇతర మొక్కల ఫైబర్ పదార్థాలతో తయారు చేస్తారు. ఇది భూమిలో కలిసిపోయేలా ఉంటుంది.
⦿ చెట్టును నాటాలి: ఒక విత్తనం లేదంటే మొక్కను పాడ్ పైన ఒక ప్రత్యేక ప్రదేశంలో నాటుతారు. ఆ తర్వాత పాడ్ ను అడవి లేదంటే తోటలో నాటుతారు.
⦿ పోషకాలను తీసుకుంటూ పెరగనున్న మొక్క: కాలక్రమేణా భూమిలో నాటిన పాడ్ విచ్ఛిన్నమవుతుంది. పాడ్ లోని పోషకాలు చెట్టు పెరుగుదలకు ఉపయోగపడుతాయి. పెరిగే చెట్టులో చనిపోయిన వ్యక్తిని చూసుకుంటారు కుటుంబ సభ్యులు.
బరియల్ పాడ్స్ పద్దతి అనేది ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఉంది. బూడిదతో కూడిన పాడ్స్ ను ఖననం చేస్తున్నారు. ఇటాలియన్ కంపెనీ కాప్సులా ముండి ఈ పాడ్స్ తయారీలో ముందు వరుసలో ఉంది. అమెరికాలోని బెటర్ ప్లేస్ ఫారెస్ట్స్ చెట్లను పెంచడానికి డెడ్ బాడీని దహనం చేసిన బూడిదను మట్టితో కలిపిన స్మారక అడవులను అందిస్తుంది. పూర్తి శరీరాన్ని ఉంచే పాడ్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. వాటి మీద మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
Read Also: మరణానికి కొన్ని సెకన్ల ముందు.. ఇలా కనిపిస్తుందట.. పరిశోధనలో అబ్బురపరిచే విషయాలు వెల్లడి!