Heart Trouble: గుండె మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. ఇది నిరంతరం పనిచేస్తూ.. రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి వాటి వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటిని అస్సలు లైట్ తీసుకోకూడదు. గుండె జబ్బుల కారణంగా ప్రారంభంలో కనిపించే సంకేతాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన లక్షణాలు:
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం: గుండె జబ్బులకు ఇది అత్యంత సాధారణ, ముఖ్యమైన లక్షణం. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున ఒత్తిడి, బిగుతు, బరువు లేదా మంటగా అనిపించడం వంటివి గుండె సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది. లేదా వచ్చి పోవచ్చు. దీన్నే ‘ఆంజైనా’ అని కూడా అంటారు. శారీరక శ్రమ చేసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఈ నొప్పి మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వచ్చే నొప్పి కూడా దీనికి దగ్గరగా ఉంటుంది. కానీ గుండె నొప్పి మరింత తీవ్రంగా.. బిగుతుగా అనిపిస్తుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: సాధారణంగా నడిచినప్పుడు లేదా చిన్న పని చేసినప్పుడు కూడా త్వరగా ఊపిరి ఆడకపోవడం లేదా ఆయాసం రావడం గుండె బలహీన పడటానికి సంకేతం కావచ్చు. గుండె సరిగా పంపింగ్ చేయనప్పుడు.. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఆయాసం అనిపిస్తే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపులో నొప్పి: గుండె నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా.. ఎడమ చేయి, రెండు చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపు వైపు కూడా వ్యాపించవచ్చు. ఈ నొప్పిని చాలా మంది తేలికైన నొప్పిగా లేదా కీళ్ల నొప్పులుగా పొరబడే అవకాశం ఉంది. ముఖ్యంగా దవడలో నొప్పి తరచుగా వస్తే అశ్రద్ధ చేయకూడదు.
ఇతర ముఖ్యమైన సంకేతాలు:
అసాధారణ అలసట లేదా బలహీనత : ఎటువంటి కారణం లేకుండా నిరంతరంగా అలసటగా అనిపించడం, కొంచెం పని చేసినా తీవ్రంగా శక్తి తగ్గిపోయినట్లు అనిపించడం గుండె సమస్యలకు, ముఖ్యంగా మహిళల్ల.. ప్రారంభ సంకేతం కావచ్చు. గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం దీనికి కారణం.
కాళ్లు, చీలమండల వాపు: గుండె సరిగా పనిచేయని సమయంలో శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. దీని కారణంగా కాళ్లు, చీలమండలు లేదా పాదాలలో వాపు (ఎడెమా) రావచ్చు.
గుండె దడ: గుండె వేగంగా కొట్టుకోవడం, అక్రమంగా కొట్టుకోవడం లేదా మధ్యలో కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపించడం. దీనిని గుండె లయలో మార్పులు అంటారు.
వికారం, వాంతులు లేదా కడుపులో అసౌకర్యం: కొందరిలో.. ముఖ్యంగా మహిళల్లో, గుండెపోటు వచ్చే ముందు కడుపు నొప్పి, వాంతులు లేదా అజీర్ణం లాంటి భావన కలగతుంది. ఈ లక్షణాలను చాలా మంది సాధారణ జీర్ణ సమస్యలుగా భావిస్తారు.
తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం: మెదడుకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు తల తిరగడం లేదా స్పృహ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇది గుండె లయ సమస్యలకు లేదా పంపింగ్ బలహీనతకు సంకేతం కావచ్చు.
పైన పేర్కొన్న లక్షణాలలో.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు తరచుగా కనిపిస్తే.. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. సకాలంలో గుండె సమస్యలను గుర్తించి.. చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడతాయి.