యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలోనే సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రసాయన పదార్థం. ఇది ఒక వ్యర్థ పదార్ధంగానే చెప్పుకోవాలి. యూరిక్ యాసిడ్ రక్తంలోనే కరిగి మూత్రపిండాల ద్వారా మూత్రంలో నుంచి బయటికి పోతుంది. యూరిక్ యాసిడ్ ను శరీరంలో ఉన్న కొన్ని కణాలను దెబ్బ తినకుండా కాపాడే ఒక యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అంటారు. అయితే అది అధిక మొత్తంలో ఉత్పత్తి అయితే మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి.
యూరిక్ యాసిడ్ అధికంగా శరీరంలో చేరితే గౌట్ నొప్పి మొదలైపోతుంది. ఇది కీళ్ల వ్యాధికి దారితీస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని రకాల శాకాహారాలు తింటూ కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం విటమిన్ సి ఉండే ఆహారాలు యూరిక్ ఆసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి ఎలాంటి ఆహారాలు శాఖాహారాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చో వివరంగా తెలుసుకోండి.
విటమిన్ సి అధికంగా సిట్రస్ పండ్లలో ఉంటుంది. అలాగే స్ట్రాబెర్రీలు, మిరియాలు వంటి వాటిలో అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ తినాల్సిన అవసరం ఉంది.
చెర్రీ పండ్లు
ఎర్రటి చెర్రీ పండ్లలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని అడ్డుకొని శరీరంలోని అదనపు యూరిక్ ఆమ్లాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇవి కీళ్లల్లో మంటను కూడా తగ్గిస్తాయి. నొప్పి వాపును కూడా అడ్డుకుంటాయి. ఈ చెర్రీ పండ్లు ఎక్కడ దొరికినా తినాల్సిన అవసరం ఉంది. వీటిని తినడం వల్ల కీళ్లలో నొప్పి, వాపు తగ్గిపోతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యూరిక్ యాసిడ్ ను విచ్ఛిన్నం చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ మధ్యాహ్నం ప్రకారం చెర్రీ పండ్లు తినడం వల్ల గౌట్ నొప్పి చాలా వరకు తగ్గుతుంది.
నిమ్మకాయ
నిమ్మకాయలు సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి తో నిండి ఉంటాయి. వీటి ద్వారా మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ తగ్గుతుందో కీళ్ల నొప్పులు గౌట్ నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే నారింజ, బత్తాయి కూడా అప్పుడప్పుడు తినాల్సిన అవసరం ఉంది. ఈ సిట్రస్ పండ్లలో సహజసిద్ధమైన సిట్రేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాలలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు నిమ్మకాయ, బత్తాయి, నారెంజ్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోండి.
దోసకాయ
దోసకాయలో హైడ్రేటింగ్ లక్షణం ఎక్కువ. ఎందుకంటే దీనిలో 90 శాతం నీరే ఉంటుంది. అలాగే ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. పోషకాలు మాత్రం నిండుగా ఉంటాయి. ఇది అదనపు యూరిక్ ఆమ్లాన్ని బయటకు పంపేందుకు ప్రభావంతంగా పనిచేస్తుంది. అధ్యయనం ప్రకారం డయాబెటిస్ రాకుండా అడ్డుకునేందుకు దోసకాయ ఉపయోగం పడుతుంది. అలాగే గుమ్మడికాయ, టమోటోలు కూడా అధికంగా తినాల్సిన అవసరం ఉంది. ఇది కూడా యూరిక్ ఆమ్లం శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.
గ్రీన్ టీ
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం గ్రీన్ టీ తాగడం వల్ల యూరిక్ ఆసిడ్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. రోజు రెండుసార్లు గ్రీన్ టీ తాగేందుకు ప్రయత్నించండి. ఇది జీవక్రియను పెంచడంతోపాటు మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇది యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లోని అధిక యూరిక్ యాసిడ్ వల్ల కలిగే కీళ్ల వాపును తగ్గిస్తుంది.
అవిసె గింజలు
అవిసె గింజల్లో శోథ నిరోధక లక్షణాలు ఎక్కువ. ప్రతిరోజు గుప్పెడు అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోండి. దీనిలో ఫైబర్లు, లిగ్నన్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడతాయి. మూత్రం ద్వారా అదనంగా పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ ను బయటికి పంపిస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం అవిసె గింజలు తిన్న తర్వాత యూరిక్ ఆమ్లం కచ్చితంగా తగ్గి తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన శాఖాహారాలను తింటూ కూడా మీరు యూరిక్ ఆమ్లాన్ని శరీరం నుంచి బయటికి పంపించుకోవచ్చు. లేదా దాని ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు.