Pakistan Shut Down Border| భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ మరో దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. నిలువ నీడ లేకుండా మండే ఎండలో ఏ దిక్కులేక పాకిస్తానీలు గంటల కొద్దీ ఉండేలా చేసింది. ఈ దృశ్యం మరెక్కడో కాదు అటారి వాఘా బార్డర్ వద్ద గురువారం కనిపించింది.
భారత ఇమిగ్రేషన్ అధికారుల కథనం ప్రకారం.. పాకిస్తాన్ అటారి వాఘా బార్డర్ గురువారం ఉదయం 8 గంటలకు మూసివేసింది. ఈ కారణంగా ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లాలనుకున్న వందలాది పాకిస్తానీ పౌరులు ఏ దిక్కూ లేక అక్కడే ఎండలో ఉండిపోవాల్సి వచ్చింది. వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
వారంతా ఎటువెళ్లాల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అధికారికంగా వారు పాకిస్తానీ పౌరులే అయినప్పటికీ సొంత దేశ ప్రభుత్వం వారిని స్వీకరించపోవడంతో తమ పరిస్థితి ఏమిటో తెలియకుండా ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనూహ్యంగా అటారి బార్డర్ పోస్ట్ మూసివేయడంతో అక్కడ భారత్ కూడా భద్రతా సిబ్బంది సంఖ్యను అమాంతం పెంచేసిందని జాతీయ మీడియా తెలిపింది. పాకిస్తాన్ ఇలా సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా బార్డర్ మూసివేయడం వెనుక కారణం ఏంటో ఇంతవరకూ స్పష్టత లేదు.
Also Read: పాక్ యుద్ధ విమానాలకు చెక్ పెట్టిన భారత్.. కొత్త టెక్నాలజీతో పాక్ పైలట్ల కళ్లకు గంతలే
పాకిస్తాన్ ఇంత అమానవీయంగా ప్రవర్తించడంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలా సొంత పౌరుల పట్ల ఒక దేశం ఎలా చేయగలదు? అని నెటిజెన్లు మండిపడుతున్నారు.
మరోవైపు భారత ప్రభుత్వం దేశంలో నివసించే పాకిస్తానీలకు తిరిగి తమ దేశం చేరుకునేందుకు విధించిన గడువుని పొడిగించింది. అంతకు ముందు వాఘా బార్డర్ ద్వారా భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులందరూ తిరిగి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తానీ పౌరులందరి వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 30 లోగా తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పింది. కానీ మానవతా దృక్ఫథంతో ఏప్రిల్ 30 వరకు విధించిన గడువును తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు నిరవధికంగా పొడిగించింది.
గత వారం పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు జారీ చేశారు. పాకిస్తానీ పౌరులెవరూ వారి రాష్ట్రాల్లో ఉండకూడదని అందరినీ పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని చెప్పారు. అయితే ఏప్రిల్ 30 చివరి రోజు కావడంతో వందలాది పాకిస్తానీ పౌరులు వాఘా బార్డర్ ద్వారా తమ స్వదేశం తిరిగి వెళ్లాలని బార్డర్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. కానీ పాకిస్తాన్ బార్డర్ మూసివేయడంతో వారిలో కొంతమంది మాత్రమే బార్డర్ దాటగలిగారు.
అధికారిక సమాచారం ప్రకారం.. గత వారం రోజుల్లో దాదాపు 800 మంది పాకిస్తానీ పౌరులు అటారి వాఘా బార్డర్ ద్వారా స్వదేశానికి వెళ్లారు. ఇందులో 55 మంది దౌత్యాధికారులు, వారి సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే పాకిస్తాన్ నుంచి దాదాపు 1500 మంది భారత పౌరులు ఇదే బార్డర్ ద్వారా తిరిగి వచ్చారు.