Walking For Fitness: నడక అనేది ఈరోజుల్లో చాలామందికి అత్యంత సులువైన, ఇష్టమైన ఆరోగ్య అలవాటుగా మారింది. ఉదయాన్నే వేగంగా నడవడం, సాయంత్రం ప్రశాంతంగా వాకింగ్ చేయడం లేదా రోజూవారీ పనుల్లో భాగంగా నడవటమైనా సరే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువు అదుపులో ఉంచడం, మానసిక ఒత్తిడిని తగ్గించి మూడ్ను బాగుచేయడంలో నడక అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ప్రతిరోజూ అసలు ఎంతసేపు నడవాలి, ఏ స్థాయిలో నడిస్తే అది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే సందేహాలు చాలామందిలో ఉంటాయి.
అందరికీ ఒకే రకమైన లక్ష్యం సరిపోదు. వయస్సు, ఫిట్నెస్ స్థాయి, ఆరోగ్య పరిస్థితి, నడిచే వేగాన్ని బట్టి ఎవరికి ఎంత నడక అవసరమనేది ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఎక్కువ దూరం నడవగలిగినా.. కొత్తగా మొదలుపెట్టేవారు నెమ్మదిగా ప్రారంభించి అలవాటు చేసుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాల సమయం నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు 25 నిమిషాల చొప్పున, రోజుకు 2 నుండి 3 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది.
Also Read: ఆధ్యాత్మికత కాదు.. దేవుడిని పూజించేటప్పుడు కళ్లు మూసుకోవడం వెనుకున్న పక్కా సైన్స్ ఇదే!
ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయాలనే ప్రచారం విస్తృతంగా ఉన్నప్పటికీ.. అది అందరికీ తప్పనిసరి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశోధనల ప్రకారం రోజుకు 7 వేల అడుగులు నడిచినా శరీరానికి అవసరమైన పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. ఇది అకాల మరణ ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. నిజానికి రోజుకు 4 వేల అడుగులు నడిచినా కూడా శరీరంలో సానుకూల మార్పులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నడక చాలా సురక్షితమైన వ్యాయామమే అయినప్పటికీ, తగినంత విశ్రాంతి లేకుండా పరిమితికి మించి నడవడం వల్ల ఇబ్బందులు తప్పవు. నిరంతరం కండరాల నొప్పులు, అలసట, నీరసంగా అనిపించడం, శరీరంలో ఉత్సాహం తగ్గడం వంటివి మీరు అతిగా శ్రమిస్తున్నారనడానికి సంకేతాలు. అలాగే తరచూ గాయాలు కావడం, నిరాశ, కోపం రావడం, ఆకలి తగ్గడం, పదేపదే జలుబు లేదా అనారోగ్యానికి గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తే నడకను కాస్త తగ్గించాలి.
అడుగుల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, మీకు ఏది వీలుగా ఉందో ఆ దినచర్యను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం. కొత్తగా మొదలుపెట్టినట్లయితే దూరాన్ని, వేగాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా, ఉత్సాహంగా అనిపించేంత వరకు నడవడమే ఆరోగ్యకరమైన పద్ధతి. వ్యాయామానికి శరీరం సహకరించేలా విశ్రాంతికి కూడా సమయం ఇవ్వడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.
Also Read: ఆఫీస్లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!