Reverse Walking: అందరూ వాకింగ్ చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు.. కానీ ముందుకే ఎందుకు నడవాలి.. వెనక్కి ఎందుకు నడవకూడదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే ముందుకు నడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది సహజమైన నడక, ఎక్కువ శ్రమ లేకుండా కదలికను సాధ్యం చేస్తుంది. కానీ వెనుకకు నడవడం సాధ్యం అయినప్పటికీ, ఇది ఎక్కువగా కష్టపడటం, తక్కువ సమతుల్యతతో కూడుకుని ఉంటుంది. అంతేకాకుండా ఇది గాయాలకు దారితీస్తుందని అందరు భయపడుతుంటారు. కానీ వెనుకకు నడవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
రివర్స్ వాక్.. వినడానికి కాస్త వింతగా అనిపించిన దాని ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సాధారణంగా నడిస్తే కాళ్లపై ఒత్తిడి పడదు.. కానీ రివర్స్ వాకింగ్ చేస్తే కాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది సమతుల్యతను కాపాడటంలో, శరీర బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మెదడు ఏకాగ్రతను పెంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును.. ఇలా రివర్స్ వాకింగ్ చాలా ప్రయోజనాలు కలిగి ఉంది. కానీ ఇది సాధారణ నడక కంటే చాలా కష్టంగా ఉంటుంది.
రివర్స్ వాకింగ్ మీ శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను మెరుగుపరుస్తుంది. మీరు సాధారణ నడకకు బదులుగా వెనకకు నడిచినప్పుడు, మీ మనస్సు పూర్తిగా మీ శరీరం కదలికపై దృష్టి పెడుతుంది. దీనివల్ల శరీర సమతుల్యతతో పాటు మనసు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఇది బరువు తగ్గించడంలో ప్రయోజనకరమైనది, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం. వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మోకాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక ఇతర సమస్యలను దూరం చేస్తుంది.
ముఖ్యంగా రివర్స్ వాకింగ్ చేయడం వల్ల పాదాలు, బలంగా మారుతాయి. శరీర సమతుల్యత మెరుగుపడుతుంది, తద్వారా తూలి పడిపోయే ప్రమాదం తగ్గుతుంది, ముఖ్యంగా వృద్దులకు చాలా ఉపయోగకరం అని చెబుతున్నారు. అంతేకాకుండా సాధారణ వాకింగ్ కన్నా, రివర్స్ వాకింగ్ ద్వారా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో అధిక బరువు తగ్గడానికి తేలికగా ఉంటుంది.
వెనక్కు నడిచేటపుడు మనం అడుగులు చిన్నవిగా వేస్తాం. ఎక్కువ అడుగులు వేస్తాం. దీనివల్ల మన కాలి కింది భాగంలోని కండరాల సామర్థ్యం పెరుగుతుంది. కీళ్ల మీద భారం తగ్గుతుంది. అలాగే మన కీళ్లు, కండరాలు కదిలే పరిధి కూడా పెరుగుతుంది. మడమ నొప్పికి సాధారణ కారణాల్లో ఒకటైన ప్లాంటర్ ఫసీటీస్ వంటి సమస్యలు ఉన్నవారికి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.వెనుకకు నడవడం వల్ల శరీరం నిలబడే తీరులో వచ్చే మార్పుల వల్ల.. మన నడుము భాగంలోని వెన్నెముకకు మద్దతునిచ్చే కండరాలను మరింత ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అంటే.. తరచుగా వెన్ను నొప్పితో బాధపడే వారికి.. వెనుకకు నడవటం వల్ల ప్రయోజనం లభిస్తుందన్నమాట. నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగుల నిలకడను, వారు నడిచే వేగాన్ని గుర్తించటానికి కూడా వారిని వెనుకకు నడిపించి పరీక్షించటం జరుగుతుంది.
Also Read: హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ?
కొన్ని అధ్యయనాలు రివర్స్ వాకింగ్ వల్ల జ్ఞాపకశక్తి, ఇతర సామర్థ్యాలు మెరుగుపడతాయని సూచిస్తున్నాయి. అంతేకాకుండా రివర్స్ వాకింగ్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తాన్ని వేగంగా పంప్ చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సమస్యలు తగ్గి ఊపిరితిత్తులు బలంగా మారతాయి. అంతేకాకుండా మనం ముందుకు నడిచినప్పుడు స్పీడ్‌గా నడుస్తాం. అయితే, కొన్నిసార్లు మెల్లిగా నడుస్తాం. అయితే, రివర్స్ నడిస్తే మాత్రం మన నడక బ్యాలెన్సింగ్ ఉందని అర్థం. దీంతో నడక ఈజీగా, రిలాక్స్‌గా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.