Wedding Issues For Men| ఇప్పుడు పెళ్లి విషయాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వయసు వచ్చిన అమ్మాయిలకు తక్షణమే సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించాలని తల్లిదండ్రులు తహతహలాడేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిలకే సంబంధాలు దొరకడం కష్టంగా మారింది. గతంలో అబ్బాయి గుణగణాలు, కుటుంబం చూసి సంబంధాలు కలిపేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం, జీతం, అప్పులు, ఆస్తులు, ఆరోగ్యం, సిబిల్ స్కోర్ వంటివన్నీ పరిశీలిస్తున్నారు.
అమ్మాయిలు ఇప్పుడు తమ ఇష్టానుసారంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. మంచి ఉద్యోగం, వేతనం, సొంత ఇల్లు ఉన్నవారిపైనే మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లో ఉన్నవారైతే వెంటనే అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అబ్బాయిల పెళ్లికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య బాగా పెరిగిపోయింది.
ఉదాహరణకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ పరిచయమైన ఓ యువతితో కులం ఒకటే కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. కానీ పెళ్లికి ముందు యువతి అతనికి నిబంధన విధించింది – తన పొట్ట తగ్గించుకోవాలని. దీంతో ఆ యువకుడు ప్రస్తుతం జిమ్‌కి వెళ్లి బరువు తగ్గించి బాడీ బిల్డింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
అలాగే వరంగల్ ప్రాంతానికి చెందిన రమేష్ (పేరుమార్చారు) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో నెలకు రూ.30 వేలు వేతనంతో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గ్రామంలో మంచి ఆస్తులు ఉన్నా కూడా మూడేళ్లుగా పెళ్లి కుదరలేదు. ఫలితంగా అతను గ్రామానికి తిరిగి వెళ్లడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. తల్లిదండ్రులకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
మరో ఉదాహరణగా.. నెల్లూరుకు చెందిన రవి కుమార్ (పేరుమార్చారు) ఎనిమిదేళ్ల క్రితం బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో నెలకు రూ.50 వేలకు పైగా వేతనంతో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ గత మూడేళ్లుగా తల్లిదండ్రులు సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా ఇప్పటివరకు పెళ్లి కుదరలేదు.
ఇంకా, సిరిసిల్లకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అతని బయోడేటా నచ్చిన యువతి కుటుంబ సభ్యులు హోటల్‌లో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఉద్యోగాలు, వేతనాలు సమానంగా ఉండడంతో పెళ్లికి అంగీకరించారు. అయితే యువతి తన చదువుకి తల్లిదండ్రులు చేసిన ఖర్చును ఐదేళ్లపాటు తన జీతం నుంచి తిరిగిచ్చేందుకు అబ్బాయి అంగీకరించాలని షరతు పెట్టింది. ఇది అబ్బాయి కుటుంబానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ పరిస్థితుల వెనుక కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల వ్యవహారశైలీ కూడా ఒక కారణం. మొదట మంచి కట్నం ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని డిమాండ్‌లు పెట్టడం వల్ల వచ్చిన మంచి సంబంధాలను తిరస్కరించడం జరుగుతోంది. కానీ ఆ తరువాత వయసు పెరిగిన తర్వాత సంబంధాలు రావడం కష్టమవుతుంది. దీనివల్ల పెళ్లి విషయంలో జాప్యం జరుగుతోంది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగమా లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా.. ఏది బెటర్?
ఇంకో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత అని భావిస్తున్నారు. అదే పట్టణాల్లో ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై, విదేశాల్లో ఉన్న సంబంధాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. అలాంటి సంబంధాలకు ఎంత కట్నమైనా ఇవ్వడానికి తల్లిదండ్రులు వెనకాడటం లేదు. దీంతో చిన్న ఉద్యోగాలు చేసే వారు, వ్యవసాయం చేసుకునేవారు సంబంధాలు దొరకక 35 ఏళ్లు దాటినా పెళ్లి కాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఈ విధంగా పెళ్లి ఆలస్యం కావడం వల్ల యువకులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పెళ్లి కాలేదని అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం పెరిగిపోతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే.. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలకు ముడిపడిన విషయమని గుర్తించాలి. అబ్బాయిలో ఓపిక, అమ్మాయిలో అర్థం చేసుకునే స్వభావం ఉన్నాయా అన్నది పరిశీలించి పెళ్లి జరిపితే ఆ బంధం స్థిరంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు ఈ కోణంలో ఆలోచిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణలు సూచిస్తున్నారు.