Cool Water in summer: వేసవి కాలం వచ్చేయడంతో ఎండలు భగభగ మండిపోతాయి. అలాంటి సమయంలో చల్లటి నీళ్లు లేదా డ్రింక్ తాగితే శరీరం కాస్త కుదుటపడినట్టుగా అనిపిస్తుంది. ఎండలో తిరిగి ఇంటికొచ్చాక ఫ్రిజ్ ఉంచిన చల్లని నీళ్లు తాగితే శరీరం తాజాగా అనిపిస్తుంది. కానీ, ఈ చల్లని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉందా? శరీరంపై దీని వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే వాటి గురించి ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ సమయం పాటు ఎండలో గడిపిన తర్వాత ఒకేసారి చల్లటి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి నిజంగానే ఏదైనా హాని జరుగుతుందా? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లని నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?
ఎండలో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టి శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరం డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాంటప్పుడు చల్లని నీళ్లు తాగితే శరీరం వేడి కాస్త తగ్గి కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. శరీరం వేడెక్కకుండా చల్లని నీళ్లు బ్యాలెన్స్ చేస్తాయి. కానీ, ఒక్కసారిగా బాగా ఐస్‌లాంటి నీళ్లు గటగటా తాగేస్తే కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మనిషి శరీరం సాధారణంగా 37 డిగ్రీల వేడిమితో పనిచేస్తుందట. చల్లని నీళ్లు తాగినప్పుడు, ఆ నీళ్లను శరీరం తన టెంపరేచర్‌కి తగ్గట్టు వేడి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో కాస్త ఎనర్జీ ఖర్చవుతుంది. అయితే, దీని వల్ల వచ్చే ఎఫెక్ట్ చాలా తక్కువగానే ఉంటుందట.
ఆరోగ్యంపై ఎఫెక్ట్?
చల్లని నీళ్లు తాగడం వల్ల కొంత మేరకు బాగానే అనిపిస్తుంది. కానీ, ఈ రకమైన అలవాటు వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
బాగా చల్లని నీళ్లు తాగితే కడుపులో రక్తనాళాలు కుంచించుకుపోతాయట. దీంతో జీర్ణం నెమ్మదిగా అయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఉండి వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల కొందరికి కడుపు నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగితే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందట.
చల్లని నీళ్ల వల్ల కొందరికి గొంతు నొప్పి లేదా జలుబు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లలో ఇలాంటి సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
చల్లని నీళ్ల వల్ల పళ్లలో సెన్సిటివిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పళ్లు బలహీనంగా ఉన్నవాళ్లకి ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
ఎండలో ఎక్కువ సమయం గడిపిన తర్వాత ఒక్కసారిగా చల్లని నీళ్లు తాగితే కొందరికి తలనొప్పి లేదా మైగ్రేన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని‘బ్రెయిన్ ఫ్రీజ్’ అని కూడా పిలుస్తారు.
ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్
ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల బాగా దాహంగా అనిపిస్తుంది. ఆ సమయంలో చల్లని నీళ్ల కన్నా రూం టెంపరేచర్‌లో ఉన్న నీళ్లు తాగడం బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణ సమస్యలు కూడా రావని అంటున్నారు.
ఎండలో ఉన్నప్పుడు చెమటతో పాటు శరీరంలో ఉన్న సాల్ట్స్ కూడా తొలగిపోతాయి. కాబట్టి, నీళ్లలో కొంచెం నిమ్మరసం, ఉప్పు, చక్కెర కలిపి తాగితే శరీరానికి ఎనర్జీ వస్తుంది. ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే మంచి ఆహారం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని డాక్టర్లు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.