Salt: మన శరీరానికి తగినంత ఉప్పు అవసరం. దీనిని తెల్ల బంగారం అని కూడా అంటారు. ఉప్పు మన ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా, ఇది మన శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఉప్పును అధిక పరిమాణంలో తీసుకుంటే మాత్రం అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు 30 రోజుల పాటు ఉప్పు తీసుకోవడం పూర్తిగా మానేస్తే, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. రక్తపోటు తగ్గుదల:
రక్తపోటును నియంత్రించడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఉప్పు తినకపోతే అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇప్పటికే రక్తపోటు తక్కువగా ఉన్నవారు బలహీనత, తలతిరుగుడు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
2. రుచిలో మార్పు:
30 రోజులు ఉప్పును మానేయడం వల్ల మీ నాలుకపై ఉన్న రుచి గ్రాహకాలు ప్రభావితం అవుతాయి. మొదట ఆహారం చప్పగా అనిపిస్తుంది. కానీ చివరికి మీ రుచి మొగ్గలు మెరుగుపడతాయి. ఫలితంగా మీరు సహజంగానే ఆహారం యొక్క నిజమైన రుచిని ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.
3. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది:
అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే అవి శరీరం నుండి అదనపు సోడియంను తొలగించాల్సి ఉంటుంది. 30 రోజులు ఉప్పును మానేస్తే మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరం నిర్విషీకరణకు సహాయపడుతుంది. మూత్రపిండాల పని తీరు సక్రమంగా కొనసాగాలంటే ఉప్పు తగిన మోతాదులో తీసుకోవడం అవసరం.
4. బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది:
సోడియం శరీరం యొక్క ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఉప్పును తినడం 30 రోజుల పాటు మానేస్తే, అలసట, కండరాల బలహీనత, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
5. గుండె ఆరోగ్యంపై ప్రభావం:
30 రోజుల పాటు ఉప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కానీ శరీరానికి తగిన మోతాదులో సోడియం అవసరం కాబట్టి దానిని పూర్తిగా తినకుండా ఉండటం సరైనది కాదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లో తక్కువగా ఉప్పు వాడాలని డాక్టర్లు చెబుతుంటారు.
Also Read: గుమ్మడి విత్తనాలతో.. మతిపోయే లాభాలు !
6. జీర్ణక్రియపై ప్రభావం:
జీర్ణ ప్రక్రియ సజావుగా పనిచేయడానికి ఉప్పు సహాయపడుతుంది. దీన్ని పూర్తిగా ఆపడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఇది ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఉప్పు తగిన మోతాదులో తినడం చాలా ముఖ్యం. ఆహార పదార్థాల్లో తగిప మోతాదులో మాత్రమే ఉప్పును ఉపయోగించాలి. బయట దొరికే జంక్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది కాబట్టి వాటిని తినకుండా ఉండటం అలవాటు చేసుకోండి.
ఏం చేయాలి ?
ఉప్పును పూర్తిగా మానేయడం మంచిది కాదు. కానీ ఎక్కువగా తినడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన , జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. మీరు 30 రోజుల పాటు ఉప్పును మానేయాలని ఆలోచిస్తుంటే.. ముందుగా వైద్యుడిని సంప్రదించండి.