CM revath reddy: తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలలో, తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం నాడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
5 ఎకరాల్లో పాఠశాల.. సాంకేతిక పరిజ్ఞానంతో విద్య.. చదువు పూర్తి చేసుకున్న సమయానికి అవకాశాలు.. ఇటువంటి పెద్ద ప్రణాళికతో విద్యాపథంలో రాణించేందుకు ముందడుగు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఉచిత విద్యను అందించేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి విద్యార్థికి.. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ స్కూల్స్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ దోహద పడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ స్కూల్స్ నిర్మాణం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో 20 – 25 ఎకరాల్లో సాగుతుండగా, 12వ తరగతి వరకు ఉచిత విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 నియోజకవర్గాల్లో ఇప్పటికే భూమి వివరాల సేకరణ పూర్తి కాగా, త్వరలోనే వీటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ క్రీడలు, వినోదంతో సహా ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌పై దృష్టి విద్యార్థులు శాటిలైట్ ఆధారిత విద్య అందించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ పోలీస్ కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తానని గతంలో సీఎం హామీ ఇచ్చారు ఆ హామీ శనివారం ఇండియా పోలీస్ స్కూల్ కు సంబంధించి https://yipschool.in వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు.
Also Read: Posani Health issue: పోసానికి సీరియస్.. జైలు అధికారులు ఏం చేశారంటే?
2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్‌తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21 న సీఎం భూమి పూజ చేశారు.