Kidney Problems: శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడం, రక్తపోటును నియంత్రించడం వంటి కీలకమైన పనులు చేస్తాయి. అయితే.. కిడ్నీలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు.. వాటి లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈ లక్షణాలు చాలా వరకు ఇతర సాధారణ అనారోగ్య లక్షణాల లాగానే ఉంటాయి. అందుకే వాటిని ముందుగానే గుర్తించడం చాలా కష్టం. అయినప్పటికీ.. కొన్ని ప్రారంభ లక్షణాలను మనం జాగ్రత్తగా గమనించగలిగితే.. సమస్యను తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్ర విసర్జనలో మార్పులు:
ఇది కిడ్నీ సమస్యలకు అత్యంత సాధారణ, తొలి లక్షణం. మూత్రపిండాల పని తీరులో లోపం ఉన్నప్పుడు.. అంటే మూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి.
తరచుగా మూత్ర విసర్జన:
ముఖ్యంగా రాత్రిపూట సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం.
మూత్రం రంగులో మార్పు:
మూత్రం రంగు ముదురుగా మారడం లేదా నురగగా కనిపించడం.
మూత్ర విసర్జనలో నొప్పి లేదా ఒత్తిడి:
మూత్రం పోసేటప్పుడు మంట లేదా నొప్పి రావడం.
మూత్రం పరిమాణంలో మార్పు:
మూత్ర విసర్జన పరిమాణం తగ్గడం లేదా పెరగడం.
శరీరం వాపు :
కిడ్నీలు ద్రవాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేనప్పుడు.. అవి శరీరంలో పేరుకుపోతాయి. దీని వల్ల చేతులు, కాళ్ళు, చీలమండలు, ముఖం, కనురెప్పల చుట్టూ వాపు వస్తుంది. ఇది శరీరంలో ద్రవాలు అధికంగా ఉన్నాయని సూచిస్తుంది.
అలసట, బలహీనత:
ఆరోగ్యకరమైన కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు.. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా రక్తహీనత వస్తుంది. దీని వల్ల నిరంతరం అలసట.. బలహీనత ,తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆకలి తగ్గడం, వికారం:
శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఆకలి తగ్గడం, నోటి రుచిలో మార్పులు, వికారం వంటివి సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా రావచ్చు.
Also Read: ఈ పండ్లు తిన్నారంటే చాలు.. 50 ఏళ్లలో కూడా యవ్వనంగా కనిపిస్తారు
వెనుక భాగంలో నొప్పి:
కొన్నిసార్లు మూత్రపిండాలు ఉన్న చోట.. అంటే నడుము వెనుక భాగంలో లేదా పక్కటెముకల కింది భాగంలో నొప్పి రావచ్చు. ఈ నొప్పి నిరంతరంగా లేదా అప్పుడప్పుడు ఉండే అవకాశం కూడా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపించిన..మాత్రాన కిడ్నీ సమస్యలు ఉన్నాయని నిర్ధారించలేము. ఇవి ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. అయితే, పైన చెప్పిన లక్షణాలలో ఏవైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు మీకు దీర్ఘకాలంగా కనిపిస్తుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే కిడ్నీలు పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.