Dirty Sponge: ప్రతీ ఇంట్లో పాత్రలను శుభ్రం చేయడానికి స్క్రబ్బర్, స్పాంజ్ ఉపయోగించడం చాలా సాధారణం. అనేక మంది మహిళలు రెండు నుండి మూడు నెలల వరకు ఒక స్క్రబ్బర్ లేదా స్పాంజ్‌ను మారుస్తుంటారు. అంతకంటే ముందు గనక అది కొద్దిగా పాడయితే మాత్రం టైల్స్ లేదా సింక్‌లను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు . కానీ మీరు పాత్రలను శుభ్రం చేసే ఈ ‘ఆయుధం’ ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుందని మీకు తెలుసా.
అవును, కొన్నిసార్లు అందులో చాలా బ్యాక్టీరియా పెరిగి అది టాయిలెట్ కంటే మురికిగా మారుతుంది. పలు అధ్యయనాల్లో ఇది రుజువైంది కూడా. అందుకే స్పాంజ్‌లు, స్క్రబ్బర్‌లను ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. మరి మురికిగా ఉన్న స్పాంజ్ లు, స్క్రబ్బర్‌లు వాడటం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబం యొక్క ఆరోగ్యం చాలా వరకు పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా అనారోగ్యానికి గురవుతుంటే గనక మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారని అర్థం. ఇందులో ఒకటి చాలా నెలల పాటు డిష్ వాషింగ్ స్పాంజ్‌లను ఉపయోగించడం. పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజ్‌లు లేదా స్క్రబ్బర్లు అనేక హానికరమైన బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వంటగది స్పాంజిలో 360 రకాల బ్యాక్టీరియా పెరగగలదు. పలు అధ్యయనాల ప్రకారం 1 క్యూబిక్ సెంటీమీటర్‌లో 54 మిలియన్ల వరకు బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
స్పాంజ్‌లు వ్యాధులకు కారణం:
మనం పాత్రలు లేదా ఇతర ఉపరితలాలను ఇదే మురికి స్పాంజ్‌లు లేదా స్క్రబ్బర్‌లతో శుభ్రం చేసినప్పుడు, ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు, ఇది మెనింజైటిస్, జ్వరం, న్యుమోనియా, విరేచనాలు వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.
స్పాంజిని ఎలా ఉపయోగించాలి ?
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వాడే స్పాంజ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చర్యలు తీసుకోవాలి. స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌ను తరచుగా మార్చాలి. ఇది చాలా వరకు బ్యాక్టీరియాను నిర్మూలించగలదు. దీంతో పాటు.. పాత స్క్రబ్బర్లు, స్పాంజ్‌లను ఒకటి లేదా రెండు వారాలలో మార్చాలి. స్క్రబ్బర్ లేదా స్పాంజ్ కంటే స్క్రబ్ బ్రష్ ఉపయోగించడం మంచిది.
Also Read: వాల్‌నట్స్ తింటే.. ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా రావు !
మీరు సిలికాన్ బ్రష్ , డిష్వాషర్ కూడా ఉపయోగించవచ్చు. కొంతమంది మహిళలు స్క్రబ్బర్‌ను శుభ్రం చేయడానికి వేడి నీటిలో మరిగిస్తారు. కానీ 2007 అధ్యయనం ప్రకారం స్పాంజిని ఉడకబెట్టడం కంటే మైక్రోవేవ్ చేయడం మంచిది. నీటిలో బేకింగ్ సోడా వేసి, అందులో స్పాంజ్ లేదా స్క్రబ్బర్ ముంచి, రెండు నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచండి. అంతే కాకుండా స్పాంజ్‌ను ఉపయోగించిన తర్వాత బాగా శుభ్రం చేయాలి. దీనిని పొడి ప్రదేశంలో ఉంచి ఎండబెట్టాలి. స్పాంజ్‌ను ఎప్పుడూ సబ్బు లేదా నీటిలో ముంచి ఉంచకూడదు.