New Connection: కొత్త విద్యుత్ కనెక్షన్ పొందాలనుకునే వినియోగదారులు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నిర్ణీత విధానాన్ని అనుసరించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) వెల్లడించింది. వినియోగదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు సమీపంలోని వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. ముందుగా ఆన్‌లైన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేసుకుని, అవసరమైన విద్యుత్ సేవకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఆపై వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగ కేటగిరీ, సరఫరా రకం, అవసరమైన విద్యుత్ లోడ్‌ను సరిగ్గా ఎంపిక చేసుకోవాలి.
గుర్తింపు ధృవీకరణ పత్రం, ఆస్తి యాజమాన్య లేదా నివాస ధృవీకరణ పత్రాలతో పాటు సంబంధిత ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. సంబంధిత విద్యుత్ అధికారులు సమర్పించిన దరఖాస్తును, విద్యుత్ సరఫరా కోసం అవసరమైన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. విద్యుత్ నెట్‌వర్క్ విస్తరణ లేదా అదనపు పనులు అవసరమైన సందర్భంలో వాటికి సంబంధించిన అంచనా వ్యయం, చెల్లించాల్సిన రుసుముల వివరాలను వినియోగదారులకు తెలియజేస్తారు. సంస్థ నిర్దేశించిన అధికారిక మార్గాల్లో నిర్ణీత రుసుములను చెల్లించి, అవసరమైన ఒప్పంద పత్రాలు, తనిఖీ ప్రక్రియలను పూర్తి చేయాలి. అవసరమైన క్షేత్రస్థాయి పనులు పూర్తి చేసి, మీటర్‌ను ఏర్పాటు చేసిన అనంతరం సంబంధిత అధికారులు విద్యుత్ సర్వీసును అధికారికంగా విడుదల చేస్తారు.
సంబంధిత అధికారులు అధికారికంగా విద్యుత్ సర్వీసును విడుదల చేసే వరకు కొత్త కనెక్షన్ ద్వారా విద్యుత్ వినియోగించకూడదు. అలాగే అదనపు లోడ్‌కు అనుమతి పొందకముందు ఆ లోడ్‌ను వినియోగించకూడదు. కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం మధ్యవర్తులను ఆశ్రయించకుండా, అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ లేదా సమీప వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీడీసీఎల్ సూచించింది. నిర్ణీత అధికారిక రుసుములు మాత్రమే చెల్లించి, చెల్లింపులకు సంబంధించిన రసీదులను భద్రపరచుకోవాలని కోరింది. ఇతర వివరాలు, ఫిర్యాదులు, సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్: 1912 లేదా www.tgsouthernpower.org వెబ్ సైట్ ద్వారా సంప్రదించాలని సంస్థ సూచించింది.
Also read: కేసీఆర్, కేటీఆర్‌లపై గులాబీ కేడర్ అలక.. యువనేతల్లో తీవ్ర అసంతృప్తి!