అయిదేళ్ల క్రితం వరకు చియా సీడ్స్ గురించి ఎక్కువమందికి తెలియవు. వాటిని తినేవారి సంఖ్య కూడా చాలా తక్కువ. వీటిని పాశ్చాత్య దేశాల్లోనే అధికంగా తినేవారు. కానీ గత రెండు సంవత్సరాలలో చియా సీడ్స్ వాడకం పెరిగిపోయింది. వీటిలో ఉండే పోషకాలు కారణంగా అవి సూపర్ ఫుడ్ గా మారాయి. స్మూతీల నుండి షేక్ ల వరకు చియా విత్తనాలను వాడడం ప్రారంభించారు. చియా సీడ్స్ వాడటం వల్ల బరువు కూడా ఆరోగ్యకరంగా తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు.
చియా సీడ్స్ ఎన్ని రకాలు?
చియా సీడ్స్ లో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో నలుపు రకం ఒకటి, తెలుపు రకం ఒకటి. చియా సీడ్స్ అమెరికాకు చెందిన మొక్కల నుండి వస్తాయి. ఇవి తమ బరువు కంటే 12 రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకొని జెల్ వంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. అందుకే చియా సీడ్స్ ను ఆరోగ్యకరంగా చెబుతారు.
అయితే చియా సీడ్స్ లో తెలుపువి మంచివా? లేక నలుపువి ఉత్తమమైనవా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెల్ల చియా విత్తనాలు… లేత క్రీమీ కలర్ లో ఉంటాయి. ఇక నల్ల చియా విత్తనాలు మచ్చలతో కూడి ఉంటాయి. ఈ రెండూ ఒకే మొక్క నుండి వస్తాయి. అయితే జన్యు శాస్త్రం కణాలపరంగా రంగులు మారుతూ ఉంటాయి. తెల్ల విత్తనాలు తిరోగమన జన్యువును కలిగి ఉంటాయి. అయితే తెల్లవాటితో పోలిస్తే నల్ల విత్తనాలే ఖరీదైనవి. తెల్ల చియా సీడ్స్ సాధారణ రకానికి చెందినవి. అయితే తెల్ల సీడ్స్ తో పోలిస్తే నల్ల చియా సీడ్స్ కొంచెం పెద్దవిగా, మందంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి.
తెలుపు, నలుపు చియా సీడ్స్… రెండూ ఒకే రకమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చియా సీడ్స్ లో నలుపు, తెలుపు ఏవైనా కూడా మీ బరువు తగ్గే ప్రయాణాన్ని సులువుగా మార్చేస్తాయి. ఈ రెండు సీడ్స్ కూడా ఆరోగ్యకరమైనవే. ఇవి కండరాలకు, ఎముకలకు, గుండెకు, మెదడుకు, జీర్ణక్రియకు ఎంతో ఇస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకున్నవారు తెలుపు చియా సీడ్స్ లేదా నలుపు చియా సీడ్స్ వాడడం ముఖ్యమే. ఇది బ్రేక్ ఫాస్ట్ లో ఈ చియా సీడ్స్ ను అధికంగా తినడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది.
చియా సీడ్స్ ఎలా ఉపయోగించాలి?
చియా విత్తనాలను స్మూతీలు, పెరుగు, సలాడ్, బేకింగ్ వంటి వాటిలో ఉపయోగించవచ్చు. మీరు తినే ఆహారాన్ని బట్టి నలుపు చియా సీడ్స్ వాడాలా? లేక తెలుపు చియా సీడ్స్ వాడాలా? అన్నది నిర్ణయించుకోవాలి. లేతరంగు వంటల్లో తెల్ల చియా సీడ్స్, ముదురు రంగు వంటల్లో నల్ల చియా సీడ్స్ కలుపుకుంటే మంచిది.