నిమ్మరసం కలిపిన నీళ్లు ఆరోగ్యానికి మంచివని చాలా మంది నమ్ముతారు. ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగితే శరీరం శుభ్రం అవుతుందని, జీర్ణక్రియ సవ్యంగా సాగుతుందని, బరువు తగ్గుతామని అనుకుంటారు. నిజానికి నిమ్మకాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి చిన్న ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. అలాగే నిమ్మకాయలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి శరీరం తాజాగా ఉంటుంది. కొందరికి జీర్ణక్రియ మందగించి బరువుగా అనిపిస్తే నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల కొంత ఉపశమనం పొందుతారు. భోజనం ముందు లేదా భోజనం తర్వాత ఒక గ్లాస్ నిమ్మరసం నీళ్లు తాగితే కడుపుబ్బర లేదా గ్యాస్ సమస్యలు కొంతవరకు నియంత్రణలో ఉంటుంది.
ఎవరు నిమ్మరసం తాగకూడదు?
నిమ్మరసం అందరికీ సరిపడవు. ముఖ్యంగా కడుపు సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అసిడిటి, గ్యాస్ట్రైటిస్, అల్సర్లు, అజీర్ణం ఉన్న వారు నిమ్మరసం నీళ్లు తాగితే కడుపులో మంట పెరిగే అవకాశం ఉంది. నిమ్మరసం లో ఉన్న ఆమ్లత ఇప్పటికే ఉన్న పొట్టలోని గాయాలను మరింత పెంచుతుంది. అల్సర్ ఉన్నవారికి అయితే నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే మౌత్ అల్సర్లు, దంత సమస్యలు ఉన్నవారూ జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం దంత ఎనామెల్‌ను క్రమంగా కరిగిస్తుంది. దీని వల్ల పళ్ళు సున్నితంగా మారి చల్లటి లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు నొప్పి వస్తుంది. పళ్ళు నొప్పి, దవడల బలహీనత ఉన్నవారు రోజూ నిమ్మరసం నీళ్లు తాగితే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం కొందరికి అసౌకర్యంగా మారి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కలిగించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
నిమ్మరసం నీళ్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శరీరానికి మంచిగా పనిచేస్తాయి. మొదటగా, ఒక గ్లాస్ నీళ్లలో అరకాయ నిమ్మరసం వేసుకోవడం సరిపోతుంది. నిమ్మరసం దంతాలకు, కడుపుకు హానికరం. రెండవది స్ట్రాతో నిమ్మరసం తాగడం మంచిది. దీని వల్ల నిమ్మరసం నేరుగా పళ్లపై పడకుండా దంత ఎనామెల్ సురక్షితంగా ఉంటుంది. మూడవది నిమ్మరసం నీళ్లు తాగిన వెంటనే సాధారణ నీళ్లతో నోరు కడగాలి. ఇలా చేస్తే నిమ్మలోని ఆమ్లం దంతాలపై ఎక్కువసేపు ఉండకుండా పోతుంది. ఖాళీ కడుపుతో తాగే అలవాటు ఉన్నవారు కడుపు సున్నితత్వం పెరిగే అవకాశం ఉంది. రోజుకు 1–2 గ్లాసులు తాగితే చాలు. అంతకన్నా ఎక్కువగా తాగితే దంతాలు, పొట్ట సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
మొత్తం మీద నిమ్మరసం నీళ్లు ఆరోగ్యానికి మంచివి అన్న మాట నిజమే. కానీ అవి అందరికీ ఒకే విధంగా పనిచేయవు. ఆరోగ్య పరిస్థితి, జీర్ణక్రియ, దంతాల బలహీనత, అలర్జీలు వంటి విషయాలు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. అందుకే నిమ్మరసం నీళ్లు మీకు మంచివేనా కాదా? ఎంత పరిమాణంలో తాగాలి? ఎప్పుడు తాగాలి? అన్న విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి. శరీరంలో మంట, నొప్పి లేదా ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే ఆపేయడం మంచిది.