International Women’s Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8వ తేదీన నిర్వహిస్తారు. మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, వారిని ప్రత్యేకంగా అభినందించడానికి ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో మహిళల కృషిని ప్రశంసిస్తారు. లింగ సమానత్వం, హింసలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. మహిళల హక్కులను గుర్తు చేసుకోవడంతో పాటు సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో వారి పాత్రను స్మరించుకుంటారు. అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు? అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. ఇంతకీ ఆ రోజునే ఈ వేడుక ఎందుకు నిర్వహిస్తారు? అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు
మహిళా దినోత్సవం అనేది కార్మిక ఉద్యమం నుంచి పురుడుపోసుకుంది. గతంలో ఎంతో మంది మహిళలు తమ హక్కుల గురించి పోరాటం చేశారు. ఎన్నో ఏండ్లపాటు కొనసాగిన పోరాటం ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. 1908లో అమెరికాలోని న్యూయార్క్ లో సుమారు 15 వేల మంది మహిళలు తమ పని గంటలు తగ్గించాలనే డిమాండ్ తో పాటు ఓటు హక్కును కల్పించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పురుషులతో సమానంగా తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించింది.
1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఇక అదే సమయంలో క్లారా జెట్కిన్ అనే మహిళ మహిళా దినోత్సవం అనేది కేవలం అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జరగాలని ఆందోళన మొదలుపెట్టింది. 1910లో కోపెన్ హాగెన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్పరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించింది. ఆ సమావేశంలో సుమారు 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళా ప్రతినిధులు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. తొలిసారి 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా సహా పలు దేశాల్లో ఈ వేడుక జరిగింది.
మార్చి 8న రష్యా మహిళల ఆందోళనలు
ఇక ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. 1917లో రష్యా మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. సరైన ఆహారం లేక, మానసిక ప్రశాంతత లేక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మహిళలు అంతా ఆందోళన బాటపట్టారు. ఫలితంగా ఆ దేశ చక్రవర్తి నికోలస్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును కల్పించింది. అయితే, ఆదేశ మహిళలు ఆందోళనకు దిగిన రోజు మార్చి 8 కావడంతో అదే రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక 1975 నుంచి ఈ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహిస్తున్నది. అప్పటి నుంచి అన్ని దేశాలు మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టాయి. మహిళలకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి.
Read Also: ఎస్కలేటర్ ఇరువైపులా సేఫ్టీ బ్రష్ లు, ఎందుకో తెలుసా?