కుక్క కాటు ఎంతో ప్రమాదకరమైనది. కుక్క కాటు వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. అందుకే కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కుక్కలాంటి క్షీరద జంతువుల లాలాజలంలో రేబిస్ వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని కుక్క కరుస్తుందో… ఆ రేబిస్ వైరస్ మనిషి శరీరంలోకి చొరబడుతుంది. కేవలం కుక్కలో మాత్రమే కాదు పిల్లులు, నక్కలు, గుర్రాలలో కూడా ఈ రేబిస్ వైరస్ ఉంటుంది. అవి కరచినా కూడా రేబిస్ వచ్చే అవకాశం ఉంది.
మన శరీరంలో రేబిస్ వైరస్ ప్రవేశించాక ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నీటిని చూస్తే చాలు భయంతో పారిపోతారు. దీని వైద్యభాషలో హైడ్రోఫోబియా అంటారు. కుక్క కాటుకు గురైన వ్యక్తి ఇలా నీటిని చూసి ఎందుకు భయపడతారు?
హైడ్రోఫోబియా అంటే ఏమిటి?
హైడ్రోఫోబియా అనేది రేబిస్ ఇన్ఫెక్షన్ చివరి దశలో కనిపించే తీవ్రమైన లక్షణం. ఈ లక్షణం కనిపించిందంటే ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలు ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. రేబిస్ వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థను చేరుకున్నప్పుడు ఇలా నీటికి భయపడడం అనే లక్షణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కనీసం నీరు కూడా తాగలేరు. గొంతు సంకోచించి దగ్గరగా అయిపోతుంది. దీని కారణంగా రేబిస్ సోకిన వ్యక్తి ఎంత దాహం వేసినా నీరు తాగలేరు. దాంతో నీటిని చూస్తేనే భయం ఏర్పడుతుంది. నీటిని మింగేటప్పుడు గొంతులో తిమ్మిరి అలాగే గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. నిద్ర కూడా పట్టదు. ఇవన్నీ కూడా హైడ్రోఫోబియా లక్షణాలు గానే చెప్పుకోవాలి.
రేబిస్ ప్రారంభ సంకేతాలు
కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. శరీరంలో ప్రవేశించాక ఫ్లూ లాంటి లక్షణాలను చూపిస్తుంది. కుక్క కరిచిన ప్రదేశంలో అసౌకర్యంగా, దురదగా కూడా అనిపించవచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యవసరం.
రేబిస్ వైరస్ ఎంత ప్రమాదకరమైనదంటే అది మెదడులోకి ప్రవేశించి నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మింగడం, శ్వాస తీసుకోవడం వంటి పనులు వీరు చేయలేరు. నీటిని చూసినా, నీరు అనే పదం విన్నా తీవ్రంగా భయం పుడుతుంది. కుక్క కాటుకు గురైన వ్యక్తికి నీటికి భయపడడం ప్రారంభించాడంటే అతని పరిస్థితి తీవ్రంగా మారిందని అర్థం. అలాగే అతని నోటిలోంచి లాలాజలం అధికంగా ఉత్పత్తి అవుతుంది.
రేబిస్ తీవ్రంగా మారాక దానికి చికిత్స చేయడం చాలా కష్టం. అంటే ఆ ఇన్ఫెక్షన్ చివరి దశకు చేరుకుందని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి పరిస్థితి ప్రాణాంతకంగా ఉంది అని తెలుసుకోవాలి. ఆ పరిస్థితి రాకుండా ముందుగానే కుక్క కరిచిన వెంటనే చికిత్స పొందితే ఈ సమస్య రాకుండా ఉంటుంది.