హిందూమతంలో ప్రధాన పురాణాలలో గరుడ పురాణం ఒకటి. జీవితంలో చేసే ప్రతి మంచి పనికి, చెడు పనికి కూడా మరణానంతరం కచ్చితంగా కర్మ ఫలితాలను అనుభవిస్తారు అని గరుడ పురాణం చెబుతోంది. జనన మరణ ప్రక్రియను ఇది వివరంగా చెబుతుంది. అలాగే స్వర్గం, నరకం, పునర్జన్మ, యమలోకం, ఆత్మ వంటి విషయాలను కూడా తెలియజేస్తుంది.
మరణించాక జరిగేది
ఈ గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించాక అతని ఆత్మను ఒక యమదూత యమరాజుకు వద్దకు తీసుకు వెళతారు. అక్కడ ఉన్న చిత్రగుప్తుడు ఆ వ్యక్తి చేసిన కర్మల వివరాలను తెలియజేస్తాడు. దాని ప్రకారం అతని ఆత్మకు తగిన ప్రతిఫలం లేదా శిక్ష విధిస్తారు. జీవితంలో మంచి పనులు చేసిన వారికి, నిజం మాత్రమే మాట్లాడిన వారికి, ఇతరులకు సాయం చేసిన వారికి శిక్షలు ఉండవు. కానీ తప్పులు చేసిన వారికి కచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి.
అబద్ధం చెప్పడం అనేది చాలా చిన్న తప్పుగా ఎంతో మంది భావిస్తారు. కానీ అబద్ధం చెప్పడం అనేది పెద్ద తప్పుగానే గరుడ పురాణం చెబుతుంది. పదే పదే అబద్ధాలు చెప్పే వారికి మరణానంతరం ప్రత్యేక శిక్షలు ఉంటాయని గరుడ పురాణం వివరిస్తోంది. ఈ లోకంలో అబద్ధం చెప్పడం ద్వారా ఎన్నోసార్లు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు… కానీ యమలోకంలో మాత్రం మీ అబద్ధాలకు శిక్షలు సిద్ధంగా ఉంటాయి. ఈ జన్మలో మీరు ఎన్ని అబద్ధాలు చెబితే మరణానంతరం మీకు అంతా కఠినమైన శిక్షలు పడతాయి.
అబద్ధాలు చెబితే పడే శిక్ష
అబద్ధాలు చెప్పి ఇతరులను తప్పుదారి పట్టించేవారు, మోసం చేసేవారు మరణానంతరం తప్పకుండా నరకానికి వెళతారు. ఈ నరకం గురించి ఆలోచిస్తేనే ఎంతో భయానకంగా ఉంటుంది. ఇక్కడ చుట్టూ అగ్నిజ్వాలలు రేగుతూ ఉంటాయి. మధ్యలో మరిగే నూనె ఉంటుంది. ఆ మరిగే నూనెలోకి అబద్ధాలు చెప్పిన పాపాత్ములను యమదూతలు విసిరేస్తూ ఉంటారు. ఆ మరిగే నూనెలో ఆత్మలు తీవ్ర బాధను అనుభవిస్తాయి.
గరుడ పురాణం చెబుతున్న ప్రకారం ఏ మానవ కర్మ కూడా దాచి ఉంచడం కుదరదు. ప్రతి చర్యకు తగిన ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది మంచిదైనా, చెడు అయినా కర్మ ఫలితాలు మరణానంతరం ఎదుర్కోవాలి. అందుకే జీవితంలో ఎప్పుడూ నిజం మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇతరుల పట్ల కరుణను కలిగి ఉండండి. పుణ్యకార్యాలు చేయండి. మరణం తర్వాత మీ ఆత్మ శాంతిని మోక్షాన్ని పొందుతుందని గరుడ పురాణం వివరిస్తుంది.