Hearing loss: ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల గర్భిణుల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అవయవాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. చాలా మందికి ప్రెగ్నెన్సీ సమయంలో వినికిడి సమస్యలు వస్తాయి. మరికొందరిలో అయితే వినికిడి శక్తి పూర్తిగా లోపిస్తుంది. అసలు ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఏంటి? వీటిని తగ్గించుకోవడం సాధ్యమేనా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అనేక సమస్యల్లో వినికిడి లోపం కూడా ఒకటి. గర్భంలో ఉన్న బిడ్డ పెరిగే సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా మందిలో తాత్కాలికంగానే ఉంటుందట. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రెగ్నెన్సీ సమయలో వచ్చే వినికిడి లోపం జీవితాంతం ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని జాగ్రత్తగా గమనించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
చెవుడు ఎందుకు వస్తుంది?
హార్మోన్లలో మార్పులు
గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్లలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా, ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రొజెస్టిరోన్ లెవెల్స్ పెరిగే అవకశం ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుందట. దీంతోనే వినికిడి సంబంధిత నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆటో ఇమ్యూన్ డిసీజ్
కొన్ని సార్లు గర్భిణులకు ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగానే వచ్చే వ్యాధులు వినికిడి కణాలు హెయిర్ సెల్స్‌ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందట. దీని వల్ల కూడా చాలా మందిలో వినికిడి లోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్లు
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో ప్రతికూల మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల వల్ల జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావచ్చట. ఇవి తరచుగా పాకాల మార్పులతో వినికిడి సమస్యలకు కారణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో అధికంగా నీటి నిల్వలు ఉండిపోతాయి. దీనివల్ల చెవి లేదా ఇతర భాగాల్లోకి నీరు చెరుతుందట. దీంతో చెవుడు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తగ్గించే మార్గం ఉందా?
ప్రతిరోజూ వ్యాయామం చేయడం, మానసిక శాంతి కలిగి ఉండడం, శరీరానికి కావాల్సినంత నిద్రపోవడం వల్ల వినికిడి సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం ముఖ్యమైనది. ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం వినికిడి సమస్య ప్రభావాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అయితే వినికిడి లోపం ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.