సీజన్ తో పని లేకుండా నిమ్మకాయలు అన్ని వాతావరణాల్లోనూ దొరుకుతాయి. అందుకే ప్రతి ఇంట్లోనూ నిమ్మకాయ పులిహోర, నిమ్మ నీళ్లు రెడీగా ఉంటాయి. ఎవరైనా వస్తే వీటినే తాగేందుకు ఇస్తాము. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో నిమ్మనీళ్లు కూడా ఒకటి. ఇవి చాలా రుచికరంగా ఉండటమే కాదు… శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. అయితే వాటిని స్టీలు గ్లాసుల్లో తాగవచ్చు. కానీ రాగి చెంబుల్లో, రాగి గ్లాసుల్లో తాగకూడదు.
రాగి పాత్రల్లో ఎందుకు తాగకూడదు?
ప్రాచీన కాలం నుంచి రాగి పాత్రలో ఎంతో మంచివని అంటారు. అందులో నీళ్లు వేసుకుని తాగితే మంచిదని చెబుతారు. అది నిజమే… కానీ నిమ్మ నీళ్లను మాత్రం అందులో వేసి ఏమాత్రం తాగకూడదు. చాలామంది ఇంట్లో తయారు చేసిన నిమ్మ నీళ్లను రాగి చెంబుల్లో లేదా రాగి గ్లాసుల్లో వేసుకొని నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు. సైన్స్ పరంగా అలా రాగి చెంబుల్లోని నిల్వ ఉంచిన లెమన్ వాటర్ ను తాగకూడదని చెబుతున్నారు నిపుణులు.
రాగి పాత్రలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ నిమ్మ నీళ్లు నిల్వ చేయడానికి మాత్రం అది మంచి పాత్ర కాదు. పైగా ఆ నీటిని అది విషపూరితం చేసే అవకాశం ఉంది.
రాగి పాత్రల్లో జరిగేది ఇదే
ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రల్లో సాధారణ నీటిని నిల్వ చేయవచ్చు. ఎందుకంటే ఇది నీటిలోని దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆ నీటిని తాగితే జీర్ణక్రియ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే నిమ్మరసాన్ని మాత్రం ఆయుర్వేద రాగి పాత్రలో వేయకూడదు. ఎందుకంటే నిమ్మరసం ఆమ్లపదార్థాలను కలిగి ఉంటుంది. రాగి పాత్రలో ఈ నిమ్మరసాన్ని వేయడం వల్ల హానికరమైన ప్రతి చర్య జరిగి… ఉప ఉత్పత్తులు పుట్టుకొస్తాయి. ఇది మన ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంది. వెనిగర్, సిట్రస్ పండ్లు అనేవి రాగి పాత్రల్లో వేయకూడదు.
రాగి మన శరీరానికి అత్యవసరమైన ఖనిజమే కావచ్చు. కానీ దాన్ని అధికంగా తీసుకుంటే మాత్రం విషపూరితమవుతుంది. రాగి పాత్రలో నిల్వచేసిన నిమ్మకాయ నీటిని పదే పదే తాగడం వల్ల శరీరంలో రాగి ఎక్కువగా పేరుకు పోతుంది. రాగి శరీరంలో అధికంగా పేరుకుపోతే విషపూరితమవుతుంది. దీని వల్ల వికారం, వాంతులు, పొట్ట తిమ్మిరి, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయి. రాగి పాత్రలో ఎక్కువసేపు ఉంచితే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రాగి వంటి లోహాలతో అధికంగా ప్రతిచర్య జరుగుతుంది. నిమ్మరసాన్ని రాగి పాత్రలో కలిపినప్పుడు రాగి .. సిట్రేట్ వంటి లవణాలను ఏర్పరుస్తుంది. ఈ లవణాలు పానీయంలో కరిగి దాని రుచిని మార్చేస్తాయి. కొన్నిసార్లు లోహపు రుచి వచ్చే అవకాశం ఉంటుంది. రాగి పాత్రలో నిల్వచేసిన నిమ్మనీటిని తాగితే ఆరోగ్యం దీర్ఘకాలంలో పాడయ్యే అవకాశం ఉంటుంది.
నిమ్మ నీటిని నిల్వ చేయడానికి గాజు, స్టెయిన్లెస్ స్టీలు, మట్టి కుండలనే ఉపయోగించాలి. ఎందుకంటే ఇవి అధికంగా ప్రతిచర్య జరపవు. నిమ్మకాయ నీటిలోని పోషకాలు రుచిని అవి సంరక్షిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యంలో రాగి పాత్రలకు స్నానం ఉన్నప్పటికీ అది తాగునీటికి మాత్రమే ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నీరు వంటి వాటికి రాగి పాత్రలు ఏమాత్రం మంచివి కాదు.