Vitiligo Day 2025: తెలుపు రంగు ఎంత పవిత్రత, శాంతికి ప్రతీక. తెల్లని వస్తువులు, స్మారకాలు చూడ్డానికి ఎంతో గొప్పగా ఉంటాయి. కానీ, చర్మంపై తెల్లని మచ్చలు కనిపిస్తే భయం వేస్తుంది. ఎందుకంటే, చాలా మంది ఒక్కేసారి ఈ మచ్చలను కుష్టురోగం (లెప్రసీ)తో సమానంగా భావిస్తారు. అయితే, విటిలిగో (బొల్లి) అనే చర్మ సమస్య కూడా తెల్ల మచ్చలను కలిగిస్తుంది. అందుకే బొల్లికి కారకాలు, అపోహలు గురించి తెలుసుకుందాం.
బొల్లి అంటే ఏమిటి?
బొల్లి అనేది ఒక రోగనిరోధక వ్యవస్థ సమస్య (ఆటోఇమ్యూన్ వ్యాధి). చర్మంలో రంగును ఉత్పత్తి చేసే కణాల (మెలనోసైట్స్)పై శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తే ఆ ప్రాంతంలో చర్మం రంగు తెల్లగా మారిపోతుంది. దీనివల్ల చర్మం రంగును కోల్పోయి, తెల్లగా లేదా సహజ చర్మ రంగు కంటే లేతగా మారుతుంది. ప్రపంచంలో సుమారు 0.5% నుండి 1% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది, కానీ ముదురు చర్మం ఉన్నవారిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
విటిలిగో లక్షణాలు
చర్మం లేదా శ్లేష్మ పొరలపై తెల్లని లేదా లేత రంగు మచ్చలు.
శరీరంలోని జుట్టు తెలుపు, బూడిద రంగులోకి మారడం.
ఈ మచ్చలు చేతులు, కాళ్లు, ముఖం, నోటి లోపల, జననాంగాల వంటి ప్రాంతాలలో సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఇవి చిన్న ప్రాంతంలో, మరికొందరిలో పెద్ద ప్రాంతంలో వ్యాపిస్తాయి.
విటిలిగో కారణాలు
రోగనిరోధక సమస్య: శరీరం మెలనోసైట్స్‌ను శత్రువులుగా భావించి నాశనం చేస్తుంది.
జన్యుపరమైన మార్పులు: DNAలో మార్పులు మెలనోసైట్స్ పనితీరును దెబ్బతీస్తాయి.
ఒత్తిడి: శారీరక లేదా మానసిక ఒత్తిడి రంగు ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
పర్యావరణ కారకాలు: అతినీలలోహిత (అల్ట్రా వయోలెట్) కిరణాలు, రసాయనాలు మెలనోసైట్స్‌ను దెబ్బతీస్తాయి.
బొల్లితో చర్మ సమస్యలు
బొల్లి వలన ఏర్పడే తెల్ల మచ్చలు సూర్యరశ్మికి సున్నితంగా ఉంటాయి. ఇవి ఏర్పడిన చోట చర్మం సూర్యరశ్మి పడగానే కాలిపోతుంది.
కంటి రెటినాలో సమస్యలు రావచ్చు, కానీ చూపు సాధారణంగా ప్రభావితం కాదు.
హైపోథైరాయిడిజం, డయాబెటిస్ వంటి ఇతర రోగనిరోధక సమస్యలు రావచ్చు.
మానసికంగా ఇబ్బందులు, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒంటరితనం వంటివి కలుగవచ్చు.
బొల్లి వలన ఆరోగ్య సమస్యలు
బొల్లి శారీరక నొప్పిని కలిగించదు. కానీ మానసికంగా ఎంతో బాధిస్తుంది. పిల్లలు ఎగతాళికి గురవుతారు, పెద్దలు వివక్షను ఎదుర్కొంటారు. సమాజంలో ‘సఫేద్ కోఢ్’ (తెల్ల కుష్టు) అని పిలుస్తూ, ఇది అంటువ్యాధి అని భావిస్తారు, కానీ అది నిజం కాదు. జన్యుపరంగా కుటుంబంలో ఉంటే రావచ్చు, కానీ అది పూర్తిగా అంటువ్యాధి కాదు.
చికిత్స, అవగాహన
విటిలిగో (బొల్లి) కు పూర్తి నివారణ లేనప్పటికీ, ముందస్తు చికిత్సతో నియంత్రించవచ్చు. కార్టికోస్టెరాయిడ్ క్రీములు, నారో-బ్యాండ్ UVB కాంతి చికిత్స, ఎక్సైమర్ లేజర్ వంటివి ఉపయోగపడతాయి. స్థిరమైన విటిలిగోకు శస్త్రచికిత్స ఒక ఎంపిక. కామోఫ్లాజ్ క్రీములు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
Also Read: భయం లేకుండా పార్టీ ఎంజాయ్ చేయండి.. ఈ టిప్స్ పాటిస్తే నో హ్యాంగోవర్
బొల్లి పట్ల పాజిటివ్ దృక్పథం
ప్రతి ఏటా జూన్ 25న ప్రపంచ విటిలిగో దినోత్సవం జరుపుకుంటారు. కెనడియన్ మోడల్ విన్నీ హార్ తనకు బొల్లి సమస్య ఉన్నా.. ధైర్యంగా తన మచ్చలను దాచకుండా మోడలింగ్ చేస్తోంది. విటిలిగో ఉన్నవారిని చూసినప్పుడు జాలిగా చూడటం, ఇబ్బందికర ప్రశ్నలు అడగటం మానేద్దాం. బొల్లి సమస్య ఒకరి నుంచి ఇతరులకు వ్యాపించదు.. కనుక విటిలిగో ఉన్నావారితో సహజంగా వ్యవహరించాలి. వారి పట్ల ఎటువంటి వివక్ష చూపకూడదు.