కళ్ళు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న వ్యాధులను సూచించే ప్రధాన అవయవాలు. అవి మార్పు చెందుతున్నాయంటే అంతర్గతంగా ఏదో ఒక వ్యాధి ఉందని అర్థం చేసుకోవాలి. చర్మం రంగు మారినా, నాలిక రంగు మారినా, కళ్ళల్లో రంగు మారినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యులను కలిసి రంగు ఎందుకు మారిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కళ్లు పసుపుగా మారితే అనేక వ్యాధులను అది సూచిస్తుంది. కళ్ళలోని తెల్లటి భాగం లేత పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే దాన్ని తేలికగా తీసుకోవద్దు. పసుపు కళ్లు కామెర్లతో సహా అనేక వ్యాధులను సూచిస్తుంది.
పసుపు రంగులోకి కళ్ళు మారడం అనేది నాలుగు వ్యాధులకు సంకే.తం ఆ నాలుగు వ్యాధులు ఏమిటో తెలుసుకోండి.
హెపటైటిస్
కాలేయానికి వచ్చే వ్యాధి హెపటైటిస్. హెపటైటిస్ వ్యాధి వస్తే కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఈ వ్యాధి కాలేయంలో వాపును కలిగిస్తుంది. కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం బిల్ రుబిన్ అనే సమ్మేళనాన్ని ఫిల్టర్ చేయలేక పోతుంది. దీనివల్ల శరీరం పసుపు రంగులోకి మారుతుంది. కామెర్ల వ్యాధిగా ఇది మారే అవకాశం ఎక్కువ.
సికిల్ సెల్ అనీమియా
కళ్ళు పసుప రంగులోకి మారడానికి సికిల్ సెల్ అనీమియా కూడా కారణం కావచ్చు. ఈ వ్యాధి ఉన్న వారిలో రక్తం జిగటగా మారడం ప్రారంభమవుతుంది. కాలేయం, ప్లీహంలో ఆ రక్తం విచ్ఛిన్నం అవడం మొదలవుతుంది. దీని కారణంగా బిల్ రూబిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. బిల్ రూబిన్ అనేది పసుపు రంగులో ఉండే సమ్మేళనం. దీనివల్ల కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. చర్మం కూడా రంగు మారే అవకాశం ఉంది. చేతివేళ్లు, కాలి వేళ్ళు విపరీతంగా నొప్పి పెడతాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే అది సికిల్ సెల్ అనీమియా అని భావించవచ్చు.
సిర్రోసిస్
కాలేయానికి వచ్చే వ్యాధి సిర్రోసిస్. సిర్రోసిస్ వ్యాధికి కూడా సంకేతం పసుపు రంగు కళ్ళే. కాలేయంలోని కణాలు దెబ్బతిన్నప్పుడు సిర్రోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది హఠాత్తుగా వచ్చే వ్యాధి కాదు. క్రమంగా కొన్ని నెలలు లేదా ఏళ్ల పాటు అభివృద్ధి చెందుతూ వస్తుంది. కాలేయం పరిమాణం తగ్గడం ప్రారంభం అవుతుంది. అంటే కాలేయం కుచించుకుపోతుంది. మృదుత్వం కూడా తగ్గిపోతుంది. సిర్రోసిస్ అనేది అధికంగా మద్యం సేవించడం వల్ల వచ్చే వ్యాధి. మద్యం సేవించకపోయినా కూడా కొందరిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. మీ కళ్ళు చాలా కాలంగా లేత పసుపు రంగులోకి మారితే వెంటనే వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకోవలసిన అవసరం ఉంది.
మలేరియా
కళ్ళు పసుపు రంగులోకి మారడానికి మలేరియా కూడా కారణమని చెప్పుకోవచ్చు. మలేరియా వ్యాధి బారిన పడితే కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. కాబట్టి పసుపు రంగులోకి కళ్ళు మారగానే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
Also Read: బొప్పాయి ఆకుల రసం తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !