సుగంధ ద్రవ్యాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి యాలకుల గురించే. మన దేశంలోని బిర్యానీ నుంచి పన్నీర్ కర్రీ వరకు అన్నింట్లోనూ యాలకుల రుచి తగలాల్సిందే. వీటిని కొనాలంటే కాస్త ఖరీదు ఎక్కువే. అలాగని కొనకుండా ఉండలేము. యాలకులు వాడితేనే కొన్ని వంటకాలకు ఎక్కువ రుచి వస్తుంది. అయితే వీటిని సులువుగా ఇంట్లోనే పండించేయొచ్చు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.
మన దేశం తేమవంతమైనదే. కాస్త ఓపిక గా కృషి చేస్తే యాలకులను మీ పెరట్లోనే పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి.
యాలకుల విత్తనాలు కొని
యాలకుల విత్తనాలను అమ్ముతారు. నర్సరీ లేదా విత్తనాల అమ్మే షాపుకు వెళ్లి అధిక నాణ్యత గల యాలకుల విత్తనాలను కొనండి. తాజా విత్తనాలను కొంటేనే మంచిది. అవి త్వరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. యాలకుల కాయల నుండి విత్తనాలను సేకరించాలనుకుంటే మాత్రం అవి ఎండబెట్టినవి, లేదా కాల్చినవి కాదని నిర్ణయించుకోండి. నిజానికి మన ఇంట్లో దొరికే యాలకులు నాటడానికి అనుకూలమైనవి కాదు. కాబట్టి విత్తనాలను కొనితెచ్చుకోవడమే మంచిది.
యాలకులను ముందుగా రంధ్రాలు ఉన్న ట్రేలను తీసుకోండి. వీటిని మొలకల ట్రే అని కూడా పిలుస్తారు. లేదా రంధ్రాలు ఉన్న చిన్న కుండలను ప్లాస్టిక్ కంటైనర్ ను కూడా ఉపయోగించవచ్చు. పీట్ కుండలు కూడా మంచిగా పని చేస్తాయి. ఇవి మొలకలకు, వేళ్లకు భంగం కలగకుండా చూస్తాయి
ఎలాంటి మట్టి?
ముందుగా కుండలో సారవంతమైన మట్టి, కోకోపీట్ లేదా నాచుతో నిండిన పీట్, తేలికపాటి మట్టి వంటివి కలిపి వేయండి. ఇప్పుడు ప్రతీ కుండలో రెండు మూడు యాలకుల విత్తనాలను నాటండి. దాదాపు అరంగుళం లోతు వరకు నాటాలి. మెల్లగా పైన మట్టితో కప్పాలి. ఒకే చోట రెండు మూడు విత్తనాలను నాటడం వల్ల అంకురోత్పత్తి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వెచ్చగా ఉండే ఉష్ణ మండల వాతావరణంలో ఏలకులు బాగా పెరుగుతాయి. కాబట్టి మొక్కలకు 21 డిగ్రీల నుండి 27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత తగిలేలా చూసుకోండి. ఇప్పుడు వర్షాకాలంలో మన భారతదేశంలో అధికంగా ఇదే ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక కుండ లోపల మట్టి తేమగా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లతో కుండలను కప్పేయండి. దీనివల్ల లోపల తేమవంతంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. దీని గ్రీన్ హౌస్ లాంటి సెటప్ అని కూడా అనుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్లతో కప్పిన కూడా ఎండలో పెడుతూ ఉండాలి.
ఇలా పెంచండి
అప్పుడప్పుడు స్ప్రే బాటిల్ తో నీళ్లను చల్లుతూ ఉండండి. అధికంగా నీరు పూయవద్దు. అధికంగా నీరు పోస్తే శిలీంద్రాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విత్తనాలు కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విత్తనాలను నాటాక, ఓపికగా వేచి ఉండండి. రెండు నుండి నాలుగు వారాలలోపు యాలకుల విత్తనం మొలకెత్తి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. తేమ, వెచ్చదనాన్ని బట్టి యాలకులు మొలకెత్తుతాయి. రెండు ఆకులు పైకి వచ్చి చిన్న మొక్కలాగా ఎదుగుతాయి.
ఈ మొలకలు మూడు నుంచి నాలుగు అంగుళాలు పొడవు పెరిగిన తర్వాత ఆ మొక్కను పెరట్లోని నేలలో పాతండి. లేదా కుండీలో నాటినా మంచిదే. దీనికి ప్రత్యక్షంగా సూర్యుడి ఎండ తగలాల్సిన అవసరం లేదు. పాక్షికంగా తగిలినా చాలు తేమను నిలుపుకునే సారవంతమైన ప్రదేశంలోనే దీన్ని నాటండ. ఎండ అధికంగా తగలకూడదు, అలాగని మరీ తక్కువ తగలకూడదు. తేమతో కూడిన వాతావరణంలో యాలకులు బాగా పెరుగుతాయి.
ఒకసారి మొక్కను కుండీలో నాటిన తర్వాత అది ఎదగడానికి సర్దుబాటు కావడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. దీనికోసం మీరు సేంద్రియ కంపోస్టును సమతుల్యమైన ద్రవ ఎరువులను వాడాలి. నత్రజని అధికంగా ఉండే ఎరువును వాడితే యాలకుల మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
యాలకులను చిన్న కుండీలా కాకుండా పెరట్లో నేలకి మీదే వేస్తే అది బాగా పెరుగుతుంది. ఇది కాయలు కాయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టవచ్చు. దీని కాయలు ఆకుపచ్చగా బొద్దుగా ఉంటాయి. ఆ సమయంలో వాటిని కోయాలి. తర్వాత వాటిని ఎండబెట్టి యాలకుల్లా మార్చుకోవాలి.