Yogandhra 2025: యోగాంధ్ర కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. అనుకున్నట్టుగానే రికార్డు స్థాయిలో ప్రజలు ఆర్కే బీచ్ రోడ్డుకు తరలివచ్చి యోగాసనాలు వేశారు. విశాఖసాగర తీరంలో మోడీతో పాటు చంద్రబాబు యోగా చేశారు. అరగంటకుపైగా యోగాసనాలు వేశారు. యోగాంధ్రలో 3 లక్షల మంది పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం సూరత్ రికార్డును అధిగమించింది.
ప్రపంచ దేశాలను ఏకం చేసిన ఘతన యోగాది అన్నారు ప్రధానీ మోదీ. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు సాధన చేశారు. కోట్ల మంది జీవితాల్లో యోగ కొత్త వెలుగులు నింపిందన్నారు మోడీ. ఆరోగ్యం కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి.
కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. నారా లోకేశ్ కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారని అన్నారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో లోకేశ్ పాత్ర కీలకమైందన్న మోదీ, కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేశ్ చొరవ ప్రశంసనీయమన్నారు. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని, యోగాకు వయస్సుతో పనిలేదని.. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని చెప్పారు.
రెండు నెలల్లో రెండోసారి ఏపీలో పర్యటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ ఏడాది మేలో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఇవాళ విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
మే 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంతోపాటు ఇతర శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని. ఆ వేదికపై నుంచే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు విశాఖ వస్తానని ప్రకటించారాయన. ప్రపంచ యోగా దినోత్సవం ప్రకటించి పదేళ్లయిన సందర్భంగా చెప్పినట్లుగానే విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ.
Also Read: విశాఖపట్నం తీరాన.. అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళ్లారు. అక్కడే ఉదయం 11 గంటలా 15 నిమిషాల వరకు ఉండనున్నారు. అనంతరం ఐఎన్‌ఎస్ పరేడ్ గ్రౌండ్ నంచి హెలికాఫ్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరనున్నారు ప్రధాని మోడీ.