చింతపండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వాటిని మనం ఆహారంలో భాగం చేసుకున్నాము. వీటిలో సౌందర్య పోషణ గుణాలు కూడా ఉన్నాయి.
చింతపండు లేని ఇల్లు కనబడదేమో. ప్రతి ఇంట్లో కూడా చింతపండు కచ్చితంగా ఉంటుంది. దాంతో పులుసులు, కూరలు, చారు వంటివి వండుతూ ఉంటారు. ముఖ్యంగా చేపల పులుసుకు కచ్చితంగా చింతపండు ఉండాల్సిందే. వంటకాలకు పుల్లటి రుచిని ఇచ్చే చింతపండు చర్మానికి అందాన్ని కూడా ఇస్తుంది.
ఎంతోమంది అమ్మాయిలకు మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి ముఖ కాంతిని తగ్గిస్తాయి. అందంగా ఉండాలన్న కాంక్షను మొటిమలు తగ్గిస్తాయి. అందాన్ని పెంచుకునేందుకు చింతపండును కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్న చింతపండుతోనే కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోండి.
మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు చింతపండును తీసుకోండి. నిమ్మకాయ పరిమాణంలో ఉండే చింతపండును తీసుకొని పావుకప్పు వేడి నీటిలో వేసి కాసేపు నాననివ్వండి. తర్వాత చేత్తోనే బాగా చింతపండును నలిపి పిప్పిని బయట పడేయండి. అది గుజ్జులాగా మిగులుతుంది. ఒక స్పూన్ ముల్తానీ మిట్టి కొద్దిగా రోజ్ వాటర్, ఆ చింతపండు గుజ్జులో వేసి బాగా కలిపి ముఖానికి మెడకు అప్లై చేయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. మీ చర్మం మెరవడం మొదలవుతుంది. మిగిలిన చింతపండు మిశ్రమాన్ని మీరు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవచ్చు. మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చింతపండు ఫేస్ ప్యాక్స్ ఉపయోగించవచ్చు.
చింతపండు గుజ్జును తీసుకొని అందులో అర స్పూన్ పసుపు కలపండి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసి 20 నిమిషాల పాటు అలా ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి. కచ్చితంగా ఈ ప్యాక్ చర్మ కాంతిని పెంచుతుంది.
బ్లీచింగ్ గుణాలు ఎక్కువ
చింతపండులో బ్లీచింగ్ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. చింతపండు గుజ్జును తీసుకొని ఒక గిన్నెలో వేయండి. తర్వాత అరటిపండు గుజ్జును కూడా అందులో వేసి శెనగపిండిని కలిపి మెత్తగా పేస్టులాగా చేసుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని చర్మానికి పట్టించి అలా వదిలేయండి. ఒక 20 నిమిషాలకు అది ఆరిపోతుంది. అప్పుడు గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మంపై ఉన్న మృత కణాలు, మురికి, వ్యర్ధాలు తొలగిపోతాయి. కాబట్టి ఇది బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. మీ ముఖాన్ని శుభ్రపరచడంలో ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది.
చింతపండు గుజ్జును ఒక స్పూన్ తీసుకొని నిమ్మరసం, అర స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇది మీకు స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. మీ ముఖంపై ఈ మిశ్రమంతో మృదువుగా మర్దనా చేసేందుకు ప్రయత్నించండి. అలా మసాజ్ చేస్తున్నప్పుడే ముఖంపై ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, మురికి, మృత కణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత వేడి నీటితో స్నానం చేయండి. జిడ్డు చర్మం కలవారికీ, మొటిమలు అధికంగా వస్తున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగితే.. మతిపోయే లాభాలు !
రెండు స్పూన్ల చింతపండు రసం అన్ని తీసుకొని టీ డికాషన్లో వేసి బాగా కలపండి. దాన్ని దూదితో ముంచి ముఖానికి రాసుకోండి. కాసేపు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీకు ఇది టోనర్ లాగా ఉపయోగపడుతుంది. అతి తక్కువ ఖర్చుతోనే ఈ చింతపండు ఫేస్ మాస్కులు తయారు చేసుకోవచ్చు.