సమయం గడిచేకొద్దీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదం కాదనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రమాదం అని చెప్పేందుకు సాక్ష్యాలేవీ దొరకకపోవడం విశేషం. అదే సమయంలో అక్కడున్న ఆనవాళ్లను బట్టి చూస్తే అది కచ్చితంగా దాడి అని చెబుతున్నారు ఆయన అభిమానులు.
సీసీ టీవీ దృశ్యాలు..
మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు చివరిసారిగా కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అక్కడ కాస్త స్లో గా ఆయన తన బుల్లెట్ బైక్ ని నడుపుతున్నారు. ఇండికేటర్ వేసుకుని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కాస్త దూరంలో ఆయన మరణించిన ప్రదేశం ఉంది. ప్రవీణ్ పగడాల మరణించిన చోట ప్రమాదం జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదని స్థానికులు అంటున్నారు. గతంలో కూడా అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగలేదని, ప్రవీణ్ బండి ప్రమాదానికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెబుతున్నారు.
ప్రవీణ్ పగడాల రాత్రి పదిన్నర గంటల వరకు కొవ్వూరులో జరిగిన ఒక చర్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన తన సొంత బైక్ పై రాజమండ్రి బయలుదేరారు. రాత్రి పొద్దుపోయినా కూడా ఆయన ఒంటరిగానే ప్రయాణం చేయాలనుకోవడం విశేషం. దారిలో కొవ్వూరు దగ్గర టోల్ గేట్ వద్ద ఆయన వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ య్యాయి. ఆ తర్వాత మరికొంత సేపటికే ఆయన విగతజీవిగా మారినట్టు తెలుస్తోంది. టోల్ గేట్ దాటాక కొంతమూరు వద్ద రోడ్డుపక్కన ఆయన చనిపోయి పడి ఉన్నారు.
అన్నీ అనుమానాలే..
ప్రవీణ్ పగడాల చనిపోయారు. అయితే ఆయన ఎలా చనిపోయారనేదే ఇంకా నిర్థారణ కాలేదు. అక్కడున్న సీన్ చూస్తే ప్రమాదం అని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవు. దాడి జరిగిందని చెప్పడానికి మాత్రం బోలెడు సాక్ష్యాలున్నట్టు స్పష్టమవుతోంది. బుల్లెట్ బైక్ కి అక్కడక్కడ గీతలు పడ్డాయి, హెడ్ ల్యాంప్ వద్ద కూడా బండి కాస్త డ్యామేజీ అయింది. బండి కింద పడితే అలాంటి డ్యామేజీ కాదని స్థానికులంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రవీణ్ పై దాడి చేసి, ఆ తర్వాత బండిని ధ్వంసం చేశారని అనుమానిస్తున్నారు.
హెల్మెట్ చెక్కుచెదరలేదు..
బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోతే కచ్చితంగా హెల్మెట్ డ్యామేజీ అవుతుంది. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల పెట్టుకున్న హెల్మెట్ కి ఏమీ కాలేదు. ప్రమాద స్థలంలోనే అది పడిపోయి ఉంది. పైగా ప్రమాద స్థలంలో ఒక చెక్క ముక్క కూడా కనపడుతోంది. దానిపై కూడా రక్త గాయాలున్నాయి. దీంతో స్థానికుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రవీణ్ పగడాల పెదాలపై గాయాలుండటం, అవి ప్రమాదం జరిగినప్పుడు తగిలిన దెబ్బల్లాగా లేకపోవడంతో కచ్చితంగా దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
హత్య చేశారా..?
ప్రవీణ్ పగడాల అంతు చూస్తామంటూ ఇటీవల కొందరు ఆయనకు వార్నింగ్ లు ఇచ్చారని, వారు అన్నంత పని చేశారంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని పాస్టర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.