Health Tips: సాధారణంగా మన అందరికీ ఒకటే గుండె ఉంటుంది. కానీ.. ఇటీవల ఒక కార్డియాలజిస్ట్ చెప్పిన విషయం అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “మనకి రెండు గుండెలు ఉంటాయి. వాటిలో ఒకటి బలహీనపడితే, ఇంకొకటి ఇబ్బందులు పడుతుంది. ఇంతకీ ఆయన చెప్పిన రెండో గుండె ఎక్కడ ఉంది ?
మన కాలు కండరాలే రెండో గుండె !
డాక్టర్ చెప్పిన రెండో గుండె మన ఛాతీలో ఉండే అసలు గుండె కాదు. అది మన కాళ్ల కండరాలు, ముఖ్యంగా మోకాలు కింద ఉండే పిక్కల కండరాలు. వీటిని కొంతమంది ‘రెండో గుండె’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు లేదా కాళ్లను కదిలించేటప్పుడు, ఈ కండరాలు మన గుండెలానే పనిచేస్తాయి.
కాళ్ల కండరాలు గుండెకi ఎలా సహాయపడతాయి ?
మన గుండె రక్తాన్ని శరీరమంతా పంప్ చేస్తుంది. కానీ కాళ్ల నుంచి రక్తాన్ని తిరిగి గుండెకి పంపించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ రక్తం కింద నుంచి పైకి.. అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణించాలి. ఈ కష్టమైన పనిని మన పిక్కల కండరాలు చాలా సులభం చేస్తాయి. మనం నడిచినప్పుడు అవి ఒత్తిడిని కలిగించి, కాళ్లలోని రక్తాన్ని పైకి.. గుండె వైపు పంపుతాయి. దీనివల్ల గుండెపై భారం తగ్గుతుంది.
రెండూ ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయి ?
మొదటి గుండె (అసలైన గుండె): ఇది రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది.
రెండో గుండె (కాళ్ల కండరాలు): ఇది మొదటి గుండె పనిని తగ్గిస్తుంది.
మనం కూర్చొని ఎక్కువ సేపు పనిచేయడం, లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల మన కాళ్ల కండరాలు బలహీనపడతాయి. అవి సరిగ్గా పనిచేయకపోతే.. గుండె రక్తాన్ని లాగడానికి ఎక్కువ కష్టపడాలి. దీనివల్ల అసలు గుండెపై ఒత్తిడి పెరిగి, క్రమంగా బలహీనపడుతుంది. దీనితో గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు కూడా రావచ్చు.
మనం కేవలం గుండె గురించి మాత్రమే కాదు.. కాళ్ల కండరాల గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలని అర్థం చేసుకోవచ్చు. రోజువారీ నడక, చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్ల కండరాలు బలంగా ఉంటాయి. అవి ఆరోగ్యంగా ఉంటే.. మన గుండె కూడా బలంగా ఉంటుంది. కాబట్టి.. ఆరోగ్యకరమైన జీవితం కోసం చురుగ్గా ఉండడం చాలా ముఖ్యం.