Health Risks: పండగలంటే కేవలం ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒక చోట చేరి ఆనందంగా గడిపే సమయం. ఈ పండగ వాతావరణంలో.. ఇళ్లలో రకరకాల పిండి వంటలు, తీపి పదార్థాలు, రుచి కరమైన వంటకాలతో సందడి నెలకొంటుంది. అయితే.. ఈ ఉల్లాసంలో మనం తెలియకుండా చేసే ఒక పెద్ద పొరపాటు… జంక్ ఫుడ్ అతిగా తీసుకోవడం. పండగ సందర్భంగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్‌ను మానుకోవాల్సిన అవసరాన్ని.. దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జంక్ ఫుడ్ అంటే ఏమిటి ?
చాలా మంది జంక్ ఫుడ్‌ను కేవలం పిజ్జా, బర్గర్లకే పరిమితం చేస్తారు. కానీ.. పండగల సమయంలో మనం ఎక్కువగా తీసుకునే ప్యాకేజ్డ్ స్నాక్స్, అధిక చక్కెరతో తయారు చేసిన చాక్లెట్లు,కూల్ డ్రింక్స్, నూనెలో వేయించిన సమోసాలు, బజ్జీల వంటి స్ట్రీట్ ఫుడ్ కూడా ఈ కోవకే చెందుతాయి. ఈ ఆహారాలలో కొవ్వు , చక్కెర, ఉప్పు మోతాదు చాలా ఎక్కువగా ఉండి పోషక విలువలు అత్యల్పంగా ఉంటాయి.
ఆరోగ్య సమస్యల ముప్పు:
పండగల సమయంలో జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల తక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.
అజీర్ణ సమస్య: జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపు ఉబ్బరం , ఎసిడిటీ , అజీర్ణం వంటి సమస్యలు తప్పవు. పండగ రోజుల్లో సంతోషంగా ఉండాల్సిన మనం, ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది.
బరువు పెరగడం : జంక్ ఫుడ్‌లో ఉండే అధిక క్యాలరీలు, ఫ్యాట్ త్వరగా బరువు పెరగడానికి కారణమవుతాయి. పండగలు ముగిసే సరికి చాలా మందిలో శరీర బరువు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఊబకాయం అనేది భవిష్యత్తులో గుండె జబ్బులు, మధుమేహం వంటి పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.
మధుమేహ ప్రమాదం: పండగ స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారి ఆరోగ్యం అదుపు తప్పే ప్రమాదం ఉంది.
గుండె సంబంధిత సమస్యలు: ఈ ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది రక్త నాళాలలో అడ్డంకులకు దారితీసి, గుండెపోటు, ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
రోగనిరోధక శక్తిపై ప్రభావం: పండగల సమయంలో వాతావరణ మార్పుల కారణంగా అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి సరిపడా పోషకాలు అందక రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది.
Also Read: మీ గుండె ప్రమాదంలో ఉందా? తెలుసుకోండిలా !
పరిష్కారం ఏంటి ?
పండగ అంటేనే ఆనందం, దాన్ని ఆరోగ్యంతో ముడిపెట్టడంలో తప్పు లేదు. రుచిని ఆస్వాదిస్తూనే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇంటి వంటకాలకు ప్రాధాన్యత: బయట లభించే జంక్ ఫుడ్‌కు బదులుగా.. ఇంట్లో చేసిన సంప్రదాయ వంటకాలు, పిండివంటలు తినండి. వీటిలో నూనె, చక్కెర మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: చాక్లెట్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్ , నట్స్, తాజా పండ్లు తినండి. చక్కెర బదులు బెల్లం లేదా తేనెను వాడిన స్వీట్లను ఎంచుకోండి.
సమతుల్యత ముఖ్యం: అన్నీ తినాలని అనిపిస్తే.. ప్రతిదీ కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోండి. ఒక్కసారిగా కాకుండా.. కొంచెం కొంచెంగా ఆస్వాదించండి.
నీరు ఎక్కువగా తాగండి: పండగ భోజనం తర్వాత శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి ఎక్కువగా తాగండి. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి.