AR Ameen car accident: మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ కుమారుడు, యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో చెన్నైలోని గిండి ఒలింపియా టెక్ పార్క్ సిగ్నల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ అమీన్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయం అమీన్ తన స్నేహితుడితో కలిసి పోర్షే (Porsche) కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పక్క రోడ్డు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక వాగన్-ఆర్ క్యాబ్ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ.. ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడికి తీవ్ర గాయాలు కాలేదు.. కేవలం స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వీరిని చికిత్స కోసం దగ్గరలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమీన్ అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే ఆయన క్షేమంగా ఉన్నారనే.. వార్త వారికి కాస్త ఊరటనిచ్చింది.