BVS Ravi: యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈయన పేరే వినిపిస్తూ ఉండడం గమనార్హం. అతి చిన్న వయసులోనే వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. అలాంటి ఈయనపై తాజాగా ప్రముఖ డైరెక్టర్ బీవీఎస్ రవి (BVS Ravi) చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తేజా సజ్జా ఒక వ్యసనపరుడు అంటూ హాట్ కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న బీవీఎస్ రవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన తాజాగా మిరాయ్ సక్సెస్ సెలబ్రేషన్స్లో ముఖ్య అతిథిగా పాల్గొని తేజా పై ఊహించని కామెంట్లు చేశారు. బీవీఎస్ రవి మాట్లాడుతూ..” తేజ సజ్జా 30 ఏళ్లు కూడా నిండకుండా.. ముక్కుపచ్చలు ఆరకుండా.. రెండు పెద్ద రూ.100 కోట్ల సినిమాలు కొట్టాడు. ఇతడికి సిగరెట్ అలవాటు లేదు.. తాగుడు అలవాటు లేదు.. గర్ల్ ఫ్రెండ్స్ అసలుకే లేరు.. ఉన్నది ఒకటే వ్యసనం. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడమే. అతను చాలా కాలం పాటు టాప్ లో ఉండబోతున్నాడు” అంటూ తేజా సజ్జా జాతకం చెప్పేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మొత్తానికైతే ఆడియన్స్ ని అలరించడమే టార్గెట్ గా పెట్టుకున్న తేజ కచ్చితంగా టాప్ స్థాయికి వెళ్ళిపోతాడు అని కూడా బీవీఎస్ రవి కామెంట్లు చేశారు.
ALSO READ:Bigg Boss 9: ముద్దుల వర్షం కురిపించిన ఇమ్ము.. తనూజా ఏం చేసిందంటే?
చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ కెరియర్ మొదలు..
ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన తేజ.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘ఇంద్ర’ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇందులో చిరంజీవి చిన్నప్పటి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. తర్వాత మహేష్ బాబు మొదలుకొని చాలామంది సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మెప్పించారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే పదుల సంఖ్యలో సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఆ తర్వాత సమంత లీడ్ రోల్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
హనుమాన్, మిరాయ్ సినిమాలతో 100 కోట్ల క్లబ్లో చేరిక..
ఈ సినిమాలో తన నటనతో అందరినీ అబ్బురపరిచిన తేజ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో ‘జాంబిరెడ్డి’ సినిమా చేసి తన నటనతో ఆకట్టుకున్నారు. మళ్లీ అదే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ అనే సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసి, రూ.100 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు పోటీగా వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా వెనక్కి తగ్గింది అంటే తేజ తన నటనతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మిరాయ్ అంటూ కొత్త డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సూపర్ యోధ పాత్రలో నటించి మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఇలా అతి చిన్న వయసులోనే ఏకంగా 100 కోట్ల క్లబ్లో రెండు చిత్రాలను చేర్చడంతో తేజా సజ్జ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.