Janaki Vs Kerala: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో మలయాళం ఇండస్ట్రీలో తెరకెక్కబోతున్న చిత్రం ‘జానకి వెర్సెస్ కేరళ’. అయితే ఈ సినిమా గత కొద్ది రోజులుగా వివాదం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అనుపమ పరమేశ్వరన్ పాత్ర పేరు జానకి కావడంతో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ చిత్ర సెన్సార్ బోర్డు ఈ పేరుపై తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ముఖ్యంగా జానకి పేరుని హిందూ పురాణాలలో సీతాదేవికి పర్యాయపరంగా పరిగణిస్తారు కాబట్టి అలాంటి పవిత్రమైన పేరుని అత్యాచార బాధితురాలు పాత్రకు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు అని సెన్సార్ బోర్డు తెలిపింది.
సెన్సార్ నిర్ణయం పై స్పందించిన నిర్మాతలు..
ఇందులో జానకి పేరు పై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చిత్ర నిర్మాతలు స్పందించారు. జానకి అనేది కేవలం ఒక పాత్రకు పెట్టిన పేరు మాత్రమే అని.. ఇందులో ఎవరిని, ఏ మతాన్ని ఉద్దేశించి పెట్టలేదని, ముఖ్యంగా ఎవరిని కించపరచాల్సిన ఉద్దేశం తమకు లేదు అని ప్రొడ్యూసర్ తెలిపారు.
టైటిల్నే మార్చేసిన సెన్సార్ బోర్డ్..
అందుకే టైటిల్ మార్చడం కుదరదు అని సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డుకి మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. మరోవైపు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీంతో జానకి వర్సెస్ కేరళ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించిన..సెన్సార్ బోర్డును.. కేరళ హైకోర్టు కూడా ప్రశ్నించింది. అదే పేరుతో గతంలో చాలా పాత్రలు, సినిమాలు వచ్చాయి కదా.. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు ప్రజలలో కూడా ఉత్కంఠ పెరిగింది. అయినా సరే సెన్సార్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు సెన్సార్ బోర్డు టైటిల్ నే మార్చాలి అని చెప్పడంతో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సూచనల మేరకు నిర్మాతలు కూడా ఈ సినిమా టైటిల్ ని మార్చడానికి అంగీకరించారు.
కొత్త టైటిల్ ఏంటంటే?
ఇకపోతే ‘జానకి వర్సెస్ కేరళ’ అనే పాత టైటిల్ ని ‘జానకి.వీ Vs స్టేట్ ఆఫ్ కేరళ’ అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు జానకి అనే పదాన్ని కూడా మ్యూట్ చేయాలి అని సెన్సార్ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు సెన్సార్ సర్టిఫికెట్ లో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపోతే నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జే ఫణీంద్ర కుమార్ నిర్మించారు.
ALSO READ:HHVM Part 2 Update : వీరమల్లు పార్ట్ 2 కొంత షూటింగ్ కంప్లీట్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.?