Suresh Gopi: ఎన్టీఆర్ కాలం నుండి నేటికీ చాలామంది సెలబ్రిటీలు సినిమాలలో సత్తా చాటి రాజకీయాలలోకి అడుగుపెడుతుంటే.. మరికొంతమంది రాజకీయాలను వదిలి సినిమాలలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏకంగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న సురేష్ గోపి (Suresh Gopi) సినిమాల్లోకి వచ్చి.. సినిమాలు చేస్తానంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈయన కేంద్ర పదవికి రాజీనామా చేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సురేష్ గోపి త్రిస్సూర్ ఎంపీ.. కేరళ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీగా పేరు సొంతం చేసుకున్న ఈయనకు.. మోడీ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అప్పటివరకు మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్న సురేష్ గోపి.. 2016 అక్టోబర్లో బీజేపీలో చేరారు. 2024 త్రిస్సూర్ లోకసభ స్థానాన్ని కేటాయించడంతో విజయం సాధించారు. కేరళ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపి మాత్రమే కావడం విశేషం. అందుకే ఆయనకు కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒకప్పుడు సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఇప్పుడు రాజకీయాలలో కూడా మంచి పేరు దక్కించుకున్నారు.
అలాంటి ఈయన తాజాగా ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..” నేను కేంద్ర పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిజాయితీగా చెబుతున్నాను. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సి.సదానందన్ మాస్టర్ ను కేంద్ర మంత్రిని చేయాలి. ఆయన చాలా సీనియర్ నాయకుడు. నా బాధ్యతను ఆయనకు అప్పగిస్తే కన్నూరు జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సదానందన్ ఎంపీ కార్యాలయం త్వరలో మంత్రి కార్యాలయంగా మారాలని కోరుకుంటున్నాను. నాకు ఆదాయం తగ్గిపోయింది. అందుకే తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నటనను కొనసాగించి మరింత సంపాదించాల్సిన అవసరం చాలా ఉంది. నేనెప్పుడూ కూడా కేంద్ర మంత్రిని అవ్వాలని కోరుకోలేదు. నా సినిమా కెరియర్ ను ఎప్పుడు వదులుకోవాలని కూడా భావించలేదు. అందుకే ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని ఆశిస్తున్నాను” అంటూ సురేష్ గోపి తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సురేష్ గోపి చేసిన కామెంట్లను బట్టి చూస్తే త్వరలోనే ఈయన తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Senior heroines: సీనియర్ హీరోయిన్స్ కి కలిసిరాని రీఎంట్రీ.. మరి కామ్నా సంగతేంటి?
ఎవరీ సదానందన్ అనే విషయానికి వస్తే.. ప్రఖ్యాత ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త కూడా.. బీజేపీతో మంచి సంబంధాలు ఉన్న ఈయన చాలా సీనియర్ నాయకుడు కూడా.. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 1994లో జరిగిన హింసలో రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వివాదం హింసాత్మకంగా మారినప్పుడు ప్రత్యర్థులు ఆయన రెండు కాళ్ళను నరికేశారు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు సురేష్ గోపి ఈయనను కేంద్ర మంత్రిని చేయాలి అంటూ సిఫార్సు చేశారు.. మరి కేంద్ర మంత్రి పదవికి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.