Daggubati Family: ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబానికి చెందిన కేసు మరోసారి వాయిదా పడింది. వారి తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయమూర్తి తదుపరి విచారణను ఫిబ్రవరి 12, 2026 వ తేదీకి వాయిదా వేశారు. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోకుండా హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, అభిరామ్ లు 2022 నవంబర్, 2023 జనవరి నెలల్లో జీహెచ్ఎంసీ సిబ్బందితో హోటల్‌ను పూర్తిగా కూల్చివేయించారని ఆయన ఆరోపించారు. హోటల్‌ను కూల్చివేసినప్పుడు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను కూడా అక్కడికి పంపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అప్పటి నుంచి కేసు నడుస్తోంది.
Read also-Soundarya Rajinikanth: కూలీ సినిమాపై రజనీకాంత్ కూతురు కామెంట్.. ఏంటీ దారుణం?
ఈ కేసు విచారణలో భాగంగా, కోర్టుకు హాజరై వ్యక్తిగత బాండ్లను సమర్పించాలంటూ కోర్టు దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేశ్ బాబు, అభిరాంలను కోర్టు ఆదేశించింది. అయితే, ఈ నలుగురు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు, వ్యక్తిగత బాండ్లను సమర్పించలేదు. గతంలో తమ న్యాయవాదుల ద్వారా బాండ్లను కోర్టుకు అందించాలని ప్రయత్నించగా, దాన్ని కోర్టు తిరస్కరించి, నలుగురు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నలుగురూ తప్పనిసరిగా ఈ సారి కోర్టుకు వస్తారని అంతా భావించినప్పటికీ, ఈసారి కూడా హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, తమ క్లయింట్లు అత్యవసర పనుల్లో ఉన్నందున రాలేక పోయారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున నలుగురు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Read also-Chandrahas: చంద్రహాస్ పాట వివాదం.. శంబాల హీరో ఊహించని రియాక్షన్!
కేసు వాయిదా పడ్డ తరువాత పిటిషనర్ నందకుమార్ మాట్లాడుతూ, ఈ కేసులో తనకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిందితులుగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేశ్ బాబు, అభిరాంలు హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నట్టుగా తనకు తెలిసిందన్నారు. కేసును విత్ డ్రా చేసుకోవాలని తనపై ఒత్తిడి కూడా తెస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ, న్యాయం జరిగే వరకు తాను పోరాటం సాగిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.