Devagudi:ఒక సినిమా థియేటర్లలోకి రావాలి అంటే సెన్సార్ అనుమతి తప్పనిసరి. ఇక సెన్సార్ సభ్యులు ఆ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయాలో చూసుకొని మరీ ఆయా సర్టిఫికెట్లు అందిస్తూ ఉంటారు. ఇక సెన్సార్ ఇచ్చిన రూల్స్ ప్రకారం చిత్ర బృందాలు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ‘దేవగుడి’ టీం మాత్రం సెన్సార్ నిర్ణయాన్ని లెక్కచేయకుండా చేసిన తీరుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ టీం పై సెన్సార్ సభ్యులు చర్య తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె కీలక పాత్రలో బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి. రఘు కొంచెం, అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహ, రఘుబాబు, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కులం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో మితిమీరిన బోల్డ్ సన్నివేశాలు, ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉండడంతో సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.. అయితే సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను బేఖాతరు చేసిన చిత్ర బృందం ఏకంగా వందమంది బాలబాలికలను హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న దేవి థియేటర్ కు తీసుకెళ్లి మరీ సినిమా చూపించారు.
సినిమా చూసిన ప్రేక్షకులు.. ఇందులో ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో.. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ సినిమాను చూపించడానికి చిత్ర బృందం ఏకంగా 100 మంది పిల్లలను థియేటర్ కి తీసుకురావడంతో.. పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడతారా? అంటూ సోషల్ మీడియాలో దేవగుడి చిత్ర బృందం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిస్థితి చూస్తుంటే సినిమా టీం పబ్లిసిటీ కోసం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది.
ఒకవైపు సెన్సార్ బోర్డు పక్కాగా ఈ చిత్రానికి ఏ (A )సర్టిఫికెట్ ఇచ్చినా.. కలెక్షన్ల కోసం, పబ్లిసిటీ కోసం చిత్ర బృందం దిగజారి మరి పిల్లలను ఈ సినిమాకు తీసుకెళ్ళింది. దీనికి తోడు సెన్సార్ రూల్స్ ను లెక్కచేయకుండా వందమంది మైనర్ పిల్లలను తీసుకొచ్చి థియేటర్లలో కూర్చోబెట్టడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ ఇచ్చిన రూల్స్ ను అతిక్రమించి ఇలా బాల బాలికలను థియేటర్కు తీసుకువచ్చిన నేపథ్యంలో వెంటనే సెన్సార్ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు
ALSO READ:The RajaSaab: రాజాసాబ్ దెబ్బ.. ప్రభాస్ మళ్లీ మారుతీతో సినిమా చేయరా?
అటు చిత్ర బృందం పైనే కాదు ఇటు దేవి థియేటర్ యాజమాన్యంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. పబ్లిసిటీ స్టంట్ల కోసం.. డబ్బు రాబట్టుకోవడం కోసం ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా? కనీసం పిల్లలను థియేటర్లోకి తీసుకురావడానికి దేవీ థియేటర్ యాజమాన్యం ఎలా అనుమతినిచ్చింది? వెంటనే దేవి థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవీ థియేటర్ సాక్షిగా జరిగిన ఈ బరితెగింపు చర్య ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.