Dheeraj Mogilineni:తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎంతో మంది కలలు కంటారన్న సంగతి తెల్సిందే.ముఖ్యంగా సినిమాపై ప్యాషన్ ఉన్నవారు ఉన్న డబ్బు లేదంటే అప్పులు చేసి మరీ నిర్మాతలుగా మారుతున్నారు. మరికొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను వదిలేసి మరీ సినిమా రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కూడా.
అయితే సినిమా నిర్మాణ రంగంలోకి రావాలనుకునే కొత్త నిర్మాతలు, దర్శకులకు ప్యాషన్ ఉంటే అసలే ఇక్కడకి రావొద్దు అంటూ సలహా ఇచ్చేస్తున్నాడు దీరజ్ మొగిలినేని.సమ్మర్ హాలీడేస్ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకొచ్చాడు.
ప్యాషన్ ఉంటే సరిపోదు.. ఇండస్ట్రీలోకి రావొద్దు!
ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్త తరం నుంచి చాలామంది సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తున్నారని చెప్పాడు.. అయితే సీనియర్లు మాత్రం థియేటర్లను నడుపుకుంటూ తమ పని తాము చేసుకుంటున్నారని, కొత్తగా సినిమాలు నిర్మించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని మనసులోని మాటని బయట పెట్టాడు. మరోవైపు కొత్తగా వచ్చిన నిర్మాతలు మాత్రం నిలదొక్కుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని చెప్పాడు.
తాను కూడా సినిమాపై ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని, దాదాపు 20 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నానని చెప్పాడు. ఇన్నేళ్ల అనుభవం తర్వాత సినిమా నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తగ్గుతాయి? అనే విషయాలపై తనకు అవగాహన వచ్చిందని తెలిపాడు.. పైగా ఇన్నేళ్లు ఈ రంగంలో ఉండి ఇప్పుడు వేరే వ్యాపారం మొదలుపెట్టడం కూడా అంత సులభం కాదని అన్నాడు..కానీ కొత్తగా వచ్చే వ్యక్తికి అలాంటి పరిస్థితి ఉండదని ధీరజ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు
ఉదాహరణకు ఒక వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాలు తీయడానికి వస్తే.. పదేళ్ల తర్వాత కూడా అతనికి సరైన గుర్తింపు, ఆదాయం రాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడుఅప్పటికి అతని కెరీర్‌లో పదేళ్లు వృథా అయినట్టే కదా.. అందుకే కొత్తవాళ్లు సినిమాలపై ఉన్న ప్రేమతోనే నిర్ణయాలు తీసుకోకుండా, భవిష్యత్తును కూడా ఆలోచించాలని సూచించాడు.
సినిమా తీయాలనుకుంటే.. ముందుగా
అయితే ఎవరైనా తన మాట వినకుండా సినిమా తీయాలనే పట్టుదలతో ఉంటే మాత్రం మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత? ఒకవేళ ఆ డబ్బంతా నష్టపోయినా మీ కుటుంబం అప్పులపాలు కాకుండా ఉండగలదా? అనే విషయాన్ని ముందుగా లెక్క వేసుకోవాలని చెప్పాడు.
ఉదాహరణకు మీ దగ్గర నాలుగు కోట్లు ఉన్నా, పది కోట్లు ఉన్నా.. ఆ మొత్తాన్ని పూర్తిగా కోల్పోయినా మీ కుటుంబం రోడ్డున పడని పరిస్థితి ఉంటేనే సినిమా నిర్మాణంలోకి రావాలని సూచించాడు. అంతేకానీ సినిమా ఆడితే కోట్లు వస్తాయి, ఓటీటీకి అమ్మేస్తాం, డిస్ట్రిబ్యూటర్లు కొనేస్తారు, ఎన్నారైలు పెట్టుబడి పెడతారు అనే ఆశలతో భారీ బడ్జెట్లు పెట్టొద్దని హెచ్చరించాడు.గతంలో సినిమా పూర్తికాకముందే ఓటీటీ డీల్స్, డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్సులు, ఎన్నారై బిజినెస్ వంటి మార్గాల ద్వారా కొంత పెట్టుబడి వచ్చేదని కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పాడు.
అప్పులు చేసి సినిమా తీయొద్దు..
మొత్తంగా సినిమా తీయాలనే ఆశతో అత్యాశకు పోవద్దు. అప్పులు చేసి భారీ బడ్జెట్లు పెట్టొద్దు. మీ ఆర్థిక స్థాయికి మించి రిస్క్ తీసుకోవద్దు. ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా తట్టుకునే స్థాయిలోనే పెట్టుబడి పెట్టాలని ధీరజ్ చెప్పిన ఈ మాటలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి !
ALSO READ :టికెట్ రూ.150.. పాప్‌కార్న్ రూ.220! ధరలపై నిర్మాత ధీరజ్ షాకింగ్ కామెంట్స్