Hollywood Horror Movie: హారర్ సినిమాలు అంటే కేవలం దెయ్యాలను చూపించి భయపెట్టడం మాత్రమే కాదు. కొన్ని కథలు ప్రేక్షకుల మనసులో ఒక తెలియని భయాన్ని నాటేస్తాయి. సినిమా చూసిన తర్వాత కూడా చీకట్లో ఒంటరిగా వెళ్లాలంటే ఆలోచించేలా చేస్తాయి. అలాంటి భయానక అనుభూతిని అందించిన చిత్రాల్లో ‘ది గ్రడ్జ్’ (The Grudge) ఒకటి. వరల్డ్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ టెర్రిఫైయింగ్ అండ్ ఐకానిక్ హారర్ ఫ్రాంచైజీలలో ఈ మూవీ మొదటి వరుసలో ఉంటుంది. జపనీస్ హారర్ మూవీ ‘జు-ఆన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ హాలీవుడ్ హారర్ మూవీ 2004లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇందులోని దెయ్యం రూపం, వింత శబ్దాలు, ఊహించని భయపెట్టే సన్నివేశాలు హారర్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.
ఈ సినిమా కథ ఒక భయంకరమైన శాపం చుట్టూ తిరుగుతుంది. టోక్యోలోని ఒక పాత ఇంట్లో ఒకప్పుడు జరిగిన దారుణ హత్యల వల్ల ఈ శాపం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళని ఆ అదృశ్య శక్తి వదలకుండా వెంటాడుతుంది. ఆ ఇంట్లో నివసించడానికి వచ్చిన ఒక అమెరికన్ ఫ్యామిలీ ఎదుర్కొన్న భయానక నరకమే ఈ సినిమా. ఆ శాపం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. దాని బారిన పడిన వారి జీవితాలు ఒక్కొక్కటిగా విషాదంగా ముగుస్తుంటాయి.
అమెరికాకు చెందిన కరెన్ డేవిస్ టోక్యోలో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా సామాజిక సేవ చేస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా ఆమెకు ఒక ఇంట్లో వృద్ధురాలైన ఎమ్మా విలియమ్స్‌ను చూసుకునే బాధ్యత వస్తుంది. అక్కడికి వెళ్లిన కరెన్‌కు మొదట్లోనే కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. ఇంట్లో కనిపించే చిన్నారి తోషియో, ఎక్కడి నుంచో వినిపించే వింత శబ్దాలు ఆమెను కలవరపెడతాయి. ఆ ఇంట్లో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని కరెన్‌కు అర్థమవుతుంది.
మరోవైపు ఆ ఇంట్లోకి వచ్చిన అమెరికన్ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా వింత పరిస్థితులను ఎదుర్కొంటారు. అక్కడ జరిగిన గత సంఘటనల గురించి తెలుసుకునే కొద్దీ కరెన్‌కు అసలు విషయం అర్థమవుతుంది. ఆ ఇంట్లో పుట్టిన శాపం కేవలం ఒక కుటుంబానికే పరిమితం కాకుండా, దాని పరిచయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ వెంటాడుతుందని తెలుస్తుంది. ఈ భయంకరమైన శక్తి నుంచి బయటపడేందుకు కరెన్ చేసే ప్రయత్నాలే మిగతా కథ.
దర్శకుడు తకాషి షిమిజు ఈ చిత్రంలో భయాన్ని చూపించిన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా దెయ్యం కనిపించే సన్నివేశాలు, గొంతు నుంచి వచ్చే వింత శబ్దం, నిశ్శబ్దంగా సాగుతూ ఒక్కసారిగా భయపెట్టే సన్నివేశాలు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తాయి. హారర్ సినిమాల్లో కొత్త తరహా అనుభూతిని కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
జపనీస్ క్లాసిక్ ‘జు-ఆన్’ ఆధారంగా హాలీవుడ్‌లో రీమేక్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కల్ట్ హారర్ మూవీ ‘The Grudge’. హారర్ లవర్స్ ని ఇప్పటికీ కలవరపెట్టే ఈ భయంకరమైన చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ JioHotstar లో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మన సౌత్ ఆడియన్స్ కోసం అద్భుతమైన తెలుగు డబ్బింగ్ ఆడియోతో ఈ మూవీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో సారా మిచెల్ గెల్లార్ కరెన్ డేవిస్ పాత్రలో నటించగా, జేసన్ బెహర్ డగ్ పాత్రలో కనిపించారు. సుమారు 92 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు తకాషి షిమిజు దర్శకత్వం వహించారు.
Read Also: ఖైదీల వరుస మర్డర్స్… కనిపించని దెయ్యాన్ని పట్టుకోవడానికి తంటాలు… జైలు అంటేనే జడిపించే హారర్