Ajay Bhupathi:హీరో కృష్ణ మనవడు జయకృష్ణ (Jayakrishna) పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రమోషన్లలో దర్శకుడు అజయ్ భూపతి(Ajay bhupathi) తన జీవితంలోని అత్యంత ఎమోషనల్ క్షణాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలు, తన తండ్రి అనారోగ్యం, ‘RX 100’ సమయంలో పడిన తపన గురించి ఆయన మాట్లాడిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అజయ్ భూపతి పంచుకున్న ఆ ఆసక్తికర విశేషాలు మీకోసం.
తన తొలి సినిమా ‘RX 100’ కథ ఓకే అయ్యే సమయానికి అజయ్ భూపతి వయసు కేవలం 29 ఏళ్ళు. ఇక ఆ చిన్న వయసులోనే ఒకవైపు సినిమా ఓకే చేయించుకోవాలనే తపన, మరోవైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని కాపాడుకోవాలనే ఆరాటం ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేసాయి. రోజువారీ హాస్పిటల్ ఖర్చులు, నిర్మాతలకు కథలు చెప్పే నరేషన్లు.. రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయడం ఎంతో సవాలుగా మారిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
సినిమా కథ ఓకే అయిన తర్వాత నిర్మాతలు రెమ్యూనరేషన్ ఎంత కావాలని అడిగినప్పుడు, అజయ్ భూపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఎలాంటి పెద్ద మొత్తంలో ఫీజు వద్దని, కేవలం తన తండ్రి వైద్యానికి అయ్యే ఖర్చులు, తన రోజువారీ అవసరాలకు కొంత డబ్బు ఇస్తే చాలని చెప్పారు. అయితే, రీమేక్ హక్కుల్లో మాత్రం ముందుగానే 50-50 శాతం వాటా ఉండాలని కండిషన్ పెట్టారు.
also read:సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ
తన తండ్రికి ఎలాంటి లోటు రాకూడదని హైదరాబాద్‌లోని అత్యుత్తమ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఆ సమయంలో ఎంత అప్పు చేయడానికైనా అజయ్ వెనుకాడలేదు. నాన్నను ఏ విషయంలోనూ తక్కువ చేయకూడదనే పట్టుదలతోనే ఆ కష్టాలన్నింటినీ భరించారు. ఇక చిన్న వయసులోనే అంతటి ఒత్తిడిని తట్టుకోవడం వల్లనే ఇప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా చాలా స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతున్నానని ఆయన తెలిపారు.
‘RX 100’ విడుదలయ్యాక సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. సినిమా ఊహించని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, అజయ్ భూపతి ముందుగా అనుకున్న 50 శాతం రీమేక్ హక్కుల ద్వారా భారీ మొత్తంలోనే ఆదాయం వచ్చింది. తను అస్సలు ఊహించనంత డబ్బు ఆ రీమేక్ రైట్స్ ద్వారానే సొంతమైంది.
సినిమా విడుదలైన రెండున్నర నెలలకే ఆయన తండ్రి కన్నుమూశారు. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన ఎక్కువ రోజులు ఉండరని అజయ్‌కి ముందే తెలుసు. కానీ, తన కొడుకు సాధించిన ఘన విజయాన్ని, ఆ సక్సెస్‌ను కళ్ళారా చూసి, అందరూ సంతోషంగా ఉన్న వాతావరణంలోనే ఆయన తుదిశ్వాస విడిచారని అజయ్ ఎమోషనల్ అయ్యారు.
ఒక సాధారణ కుర్రాడిగా పరిశ్రమలోకి వచ్చి, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న అజయ్ భూపతి ప్రయాణం నిజంగా ఎంతో మందికి స్పూర్తిదాయకం. కష్ట సమయంలో ధైర్యంగా నిలబడి, నాన్న ప్రేమ కోసం ఆయన పడిన తపన ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతోంది.