Radhika Apte:సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్నైనా సరే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్స్ లో బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే ముందు వరుసలో ఉంటారు. పలు అంశాలపై స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తో చేసిన సిరీస్ అక్క(Akka). నేటి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రాధిక ఆప్టే (Radhika Apte) ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నాటి విషయాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు లో దుస్తులు లేకుండా స్టంట్స్ చెయ్యమన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ..” లో దుస్తులు లేకుండా కేవలం షర్టు మాత్రమే ధరించి, బటన్స్ విప్పేసి యాక్షన్ సీన్ చేయగలరా అని షూటింగ్ మొదలయ్యాక అడిగారు. అసలు ఫిజిక్స్ పరంగా ఇది సాధ్యమవుతుందా? ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కానీ సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత బేరాలు ఆడడం నన్ను చాలా ఇబ్బందికి గురిచేసింది. ముఖ్యంగా ఆ పార్ట్ చూపిస్తారా? ఈ పార్ట్ చూపిస్తారా? అంటూ సుమారుగా రెండు వారాలపాటు చిత్ర బృందం నన్ను టార్చర్ పెట్టింది అంటూ ఎమోషనల్ అయింది.
ఇకపోతే ఇదే విషయంపై రాధిక ఆప్టే మాట్లాడుతూ..” సాధారణంగా బోల్డ్ సీన్లు చేసేటప్పుడు ఇంటిమసీ కోఆర్డినేటర్లు నటీనటులకు రక్షణగా ఉంటారు. కానీ అలాంటి వారే ఇప్పుడు నిర్మాతల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారు. ఎవరైనా సరే హీరోయిన్ల తరఫున మాట్లాడితే వాళ్ళని ఏకంగా ఉద్యోగాల్లో నుంచే తీసేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది రాధిక ఆప్టే.
ఇకపోతే తాను అందరిని ఉద్దేశించి అలా మాట్లాడడం లేదని, ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరని, పదిమందిలో ఒకరిద్దరూ ఇలా చేసేవాళ్ళు ఉన్నారు అంటూ అసలు సమస్యను బయటపెట్టింది. మొత్తానికి అయితే అక్క వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టింది రాధిక ఆప్టే. అయితే ఆ సినిమా పేరేంటి? తనను అలా నటించమని కోరిన చిత్ర యూనిట్ ఎవరు ?అనే విషయాలపై మాత్రం ఆమె స్పందించలేదు. ఏది ఏమైనా రాధిక ఆప్టే చేసిన ఈ కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హిందీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్కలో రుద్ర పాత్రలో నటించింది రాధిక ఆప్టే. నేటి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రదర్శించబడుతోంది. ఇందులో కీర్తి సురేష్ భవాని అనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో తన్వి అజ్మీ, అన్షుమాన్ పుష్కర్, పూర్ణిమ ఇంద్రజిత్తు, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ధర్మ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.