Krish -HHVM: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక త్వరలోనే అనుష్క(Anushka) ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ(Ghaati) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్..
ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ క్రిష్ కు హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈయన దర్శకత్వంలో కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన ఈ సినిమా నుంచి తప్పుకొని ఘాటీ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే చిత్ర బృందంతో ఈయనకు ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగానే బయటకు వచ్చారనే వాదన తెరపైకి వచ్చింది. అయితే వీరమల్లు నిర్మాత ఏ. యం రత్నం మాత్రం ఆయన ఇతర సినిమాల షూటింగ్ కారణంగానే తప్పుకున్నారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ, గౌరవం..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఈయనకు ఇదే ప్రశ్న ఎదురయింది. ఇప్పటికీ హరిహర వీరమల్లు పేరు చెబితేనే దర్శకుడుగా మీ పేరు గుర్తుకు వస్తుంది అలాంటిది ఈ సినిమా నుంచి మీరు తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు దర్శకుడు సమాధానం చెబుతూ.. నాకు ప్రతి సినిమా ఒక జర్నీ.. హరిహర వీరమల్లు సినిమాను కొంత భాగం నేను దర్శకత్వం వహించాను. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఏ.ఏం రత్నం గారు అంటే చాలా గౌరవం. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని తనతో సినిమాలు చేయాలని కోరుకున్న వారిలో నేను ఒకడిని. మేము ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా బయటకు రావాల్సి వచ్చింది. కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
నా వ్యక్తిగత కారణాలే..
నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను అంతటితో ఆ సినిమా విషయంలో నా జర్నీ పూర్తి అయ్యిందని క్రిష్ తెలిపారు. ఇలా ఈ ప్రయాణంలో జ్యోతి కృష్ణ భాగమయ్యారు. తాను ఘాటీ సినిమాతో మరో జర్నీ ప్రారంభించాను అంటూ ఈ సందర్భంగా క్రిష్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి విష్ చేస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఘాటి సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని క్రిష్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Allu Arjun: నాన్నమ్మ మరణం.. ఫస్ట్ టైం ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!