Tollywood : సినీ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. నిర్మాతలు వేతనాలు పెంచేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అటు సినీ కార్మికులు, వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అన్ని సినిమా షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి సినీ పెద్దలు ముందుకు రావాలని నిర్మాతలు కోరుతున్నారు. ఇప్పటికే నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని, నందమూరి బాలకృష్ణను కలిశారు. ఈ భేటీల తర్వాత, ఎప్పటి నుంచో చర్చలో ఉన్న “ఇండస్ట్రీ పెద్ద” అనే అంశంపై సినీ వర్గాలకు కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
చిరంజీవి రియాక్షన్..
నిర్మాతల భేటీలో చిరంజీవి, బాలకృష్ణల నుంచి వచ్చిన రియాక్షన్‌లను బట్టి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దొరికినట్టేనని కొందరు అంటున్నారు. చిరంజీవి రియాక్షన్ సాధారణంగా ఉందని, సమస్యను నిర్మాతలే పరిష్కరించుకోవాలని సూచించినట్టు సమాచారం. మూడు, నాలుగు రోజుల తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే, అప్పుడు తాను జోక్యం చేసుకుంటానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ రియాక్షన్…
తర్వాత, నిర్మాతలు బాలకృష్ణతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను వారు వివరించారు. నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని బాలకృష్ణ అన్నారు. ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అటు సినీ కార్మికులు, ఇటు నిర్మాతలు ఇరువురూ బాగుండేలా చూస్తానని కూడా హామీ ఇచ్చారు. అలాగే, థియేటర్ల సమస్యలు, పెద్ద సినిమాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి తన వంతుగా ఏడాదికి నాలుగు సినిమాల్లో నటిస్తానని నిర్మాతలతో చెప్పారు.
చిరంజీవి రియాక్షన్ పై ఇండస్ట్రీలో చాలా మంది వ్యాఖ్యలు చేశారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ రాలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, బాలకృష్ణ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం. దీంతో, ఎన్నాళ్లుగా సమాధానం లేని “ఇండస్ట్రీ పెద్ద” అనే అంశంపై ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తోంది.
ఇండస్ట్రీ పెద్ద ఎవరు ?
అయితే, బాలకృష్ణ హామీ కేవలం హామీగానే మిగిలిపోతుందా? లేక, ప్రస్తుత ఇండస్ట్రీ సమస్యను ఆయన పరిష్కరిస్తారా? ఒకవేళ బాలకృష్ణ ఈ సమస్యను పరిష్కరిస్తే, ఇండస్ట్రీ పెద్దగా ఆయన స్థానం సుస్థిరం కావచ్చు. ఒకవేళ అలా కాకుండా, హామీ హామీగానే మిగిలిపోతే, ఇండస్ట్రీ పెద్ద అనే అంశం ఎప్పటిలాగే పెండింగ్‌లోనే ఉండిపోతుంది. చూడాలి మరి, ఈ సమస్యను చిరంజీవి పరిష్కరిస్తారా? బాలకృష్ణ పరిష్కరిస్తారా? లేక, ఇద్దరూ కలిసి పరిష్కరిస్తారా?
నేడు చిరంజీవితో సినీ కార్మికుల భేటీ
సినీ కార్మికులు మెగాస్టార్ చిరంజీవితో భేటీ కానున్నారు. దీనికి కంటే ముందు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు – ఫెడరరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఛైర్మెన్ దిల్ రాజుతో సినీ కార్మికులు సమావేశం కానున్నాయి. దీని తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ కానున్నారు. చివరగా మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు సమావేశాం అయి.. తమ సమస్యలను వివరించనున్నారు. చివరికి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… దానికి కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ సభ్యులు చెబుతున్నారు.