Gollapudi Maruthi:గొల్లపూడి మారుతీరావు..తెలుగు తెరపై తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన వెర్సటైల్ యాక్టర్. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా అన్ని రంగాల్లో సత్తా చాటిన ఈయన నటన చాలా స్పెషల్ అని చెప్పాలి. ముఖ్యంగా అరవకుండా, భయంకరంగా కనిపించకుండా కేవలం మాటలతోనే ప్రేక్షకుల్లో భయం పుట్టించడం ఈయన స్టైల్.అలాంటి గొల్లపూడి గతంలో చెప్పిన కొన్నిఆసక్తి కరమైన విషయాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
42 ఏళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ!
గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తనకు 42 ఏళ్ల వయసులో నటుడిగా అవకాశం వచ్చిందని అప్పటికే రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు.ఆ రోజుల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, కుయిలి వంటి హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేశానని, గుర్రపు స్వారీ కూడా చేశానని చెప్పారు. అయితే వయసుకు మించి శారీరకంగా కష్టపడటం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురయ్యాయని, 72 ఏళ్ల వయసులో కాళ్లకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
బ్లాంక్ చెక్ ఇచ్చిన నిర్మాత!
ఇక తన కెరీర్‌లో ఒక నిర్మాత ఇచ్చిన ఆఫర్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు గొల్లపూడి . జీసీ శేఖర్ అనే నిర్మాత తన దగ్గరకు వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చారని మీరే కథ రాసి, మీరే దర్శకత్వం వహించండి.. నాకు సినిమా చేసి పెట్టండి అని అడిగారని ఆరోజుల్ని గుర్తు చేసుకున్నారు.అలా తనపై నమ్మకం ఉంచి బ్లాంక్ చెక్ ఇచ్చిన వ్యక్తి తన కెరీర్‌లో మరొకరు లేరని చెప్పారు. అయితే ప్రతి అవకాశం తీసుకోవాల్సిన అవసరం లేదని, మనకు ఏది వచ్చో, ఏది రాదో తెలుసుకోవడం కూడా ముఖ్యమని వివరించారు.
నాకు వచ్చినవి మాత్రమే చేస్తాను!
ఇక తనకు ఏం చేయడం వచ్చు? ఏం రాదు? అనే విషయం తనకు ఎప్పుడూ తెలుసని,మన పరిమితులు మనకు తెలియడమే నిజమైన జ్ఞానమని తన అభిప్రాయాన్ని చెప్పారు.ఒక నటుడు బాగా నటిస్తున్నాడా లేదా అనేది ప్రేక్షకులు చెబుతారని, తన గురించి తానే గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
విలన్ పాత్రల్లో అలాంటి కొత్త స్టైల్!
ఇక గొల్లపూడి విలన్ పాత్రలు ఎందుకు ప్రత్యేకంగా ఉండేవో చెబుతూ సాధారణంగా విలన్ అంటే పెద్ద శరీరం, గంభీరమైన గొంతు, భయపెట్టే చూపులు ఉండాలని అనుకునేవారని,కానీ తనకు అలాంటి లక్షణాలు లేవని, అందుకే తనలో ఉన్న ప్రత్యేకతలతోనే విలన్ పాత్రను తయారు చేసుకున్నానని చెప్పారు.ముఖ్యంగా మంచివాడిలా కనిపిస్తూ, ఎదుటివారితో మర్యాదగా మాట్లాడుతూ తనలోని చెడ్డ ఆలోచనలను బయటపెట్టకుండా ఉండే పాత్రలను చేయడం తన ప్రత్యేకతగా వివరించారు ఈ వెర్సటైల్ యాక్టర్.
ఇక గొల్లపూడి తన కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు చాలామంది చిరంజీవి సినిమా అనుకున్నారని అయితే ఇందులో కృష్ణయ్య పాత్రలో నటించింది తానేనని చెప్పారు.
మొదట ఈ పాత్ర తనకు ఇస్తామని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని, ఇంత పెద్ద పాత్ర తనతో చేయించడం ఏమిటని అనుకున్నానని తెలిపారు.ఈ సినిమాలో దాదాపు 40 సీన్స్ లో కనిపించానని, సినిమా 515 రోజులు ఆడిందని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు గొల్లపూడి.
ALSO READ :జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!